విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. మధ్యాహ్న భోజనంలో కోడికూర‌, సీజనల్‌ ఫ్రూట్స్‌

Bengal to serve chicken, fruits in mid-day meals for-four-months.మ‌ధ్యాహ్నా భోజ‌నంలో భాగంగా విద్యార్థుల‌కు కోడికూర‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 12:32 PM IST
విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. మధ్యాహ్న భోజనంలో కోడికూర‌, సీజనల్‌ ఫ్రూట్స్‌

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇక నుంచి మ‌ధ్యాహ్నా భోజ‌నంలో భాగంగా విద్యార్థుల‌కు కోడికూర‌, సీజనల్‌ పండ్లు అందించ‌నున్నారు. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో. ఈ మేర‌కు అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అందుకు అవ‌స‌రం అయిన నిధుల‌ను కూడా విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 23 నుంచి నాలుగు నెల‌ల పాటు దీన్ని అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

ప్ర‌ధాన మంత్రి పోష‌ణ్ ప‌థ‌కం కింద అమ‌లు అవుతున్న మ‌ధ్యాహ్నా భోజ‌నంతో పాటు ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ ను వారానికి ఒక‌సారి అందిచ‌నున్న‌ట్లు తెలిపింది. దీనిని జనవరి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు కొనసాగించ‌నున్న‌ట్లు విద్యాశాఖ తెలిపింది. దీనికోసం ప్ర‌భుత్వం అదనంగా రూ.371 కోట్లు విడుద‌ల చేసింది. అంటే అదనపు పోషకాహారం కోసం ప్ర‌తి విద్యార్థికి అద‌నంగా రూ.20 ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానమంత్రి పోషన్‌ అభియాన్‌ పథకంలో భాగంగా వీరంద‌రికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీని కోసం రాష్ట్రం, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి. అయితే.. ప్ర‌స్తుతం కేటాయించిన నిధులు పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన‌వే. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో గ్రామపంచాయతి ఎన్నికలు జ‌ర‌గ‌నుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నిర్ణ‌యం అధికార తృణమూల్ కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది. ఇన్ని రోజులు అన్నం, ప‌ప్పులు వంటివి మాత్ర‌మే ఇచ్చి ఇప్పుడు స‌డెన్ చికెన్ కూడా ఇవ్వాల‌ని అనుకోవ‌డానికి కార‌ణం కేవ‌లం ఎన్నిక‌లే అని, కేవ‌లం రాజకీయ కోణంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది. దీనిపై తృణ‌మూల్ నేత‌లు గ‌ట్టిగానే ప్ర‌తి స్పందించారు. ప్ర‌తీది రాజకీయ కోణంలో చూడ‌వ‌ద్ద‌ని, త‌మ‌ది పేద‌ల ప్ర‌భుత్వం అని అన్నారు.

Next Story