బెంగాల్‌లో ఉద్రిక్తత.. నిరసనకారులు రాళ్లు వేయడంతో పరుగు తీసిన బీజేపీ అభ్యర్థి

ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది.

By Srikanth Gundamalla
Published on : 25 May 2024 6:15 PM IST

Bengal, lok sabha polling, attack,  bjp mp candidate ,

బెంగాల్‌లో ఉద్రిక్తత.. నిరసనకారులు రాళ్లు వేయడంతో పరుగు తీసిన బీజేపీ అభ్యర్థి

శనివారం ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఝుర్‌గ్రామ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రణత్‌ టుడుకి చేదు అనుభవం ఎదురైంది. మిడ్నాపూర్‌ జిల్లాలోని గర్బెటాలోని మంగళపోతా ప్రాంతంలో ప్రణత్‌ టుడుపై పలువురు నిరసనకారులు రాళ్లు విసిరారు దాంతో బీజేపీ అభ్యర్థి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రణత్‌ టుడు అక్కడి నుంచి పారిపోతున్న క్రమంలో ఆయన్ని రక్షించడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. షీల్డ్‌లు ఆయన చుట్టూ పెడుతూ రక్షించారు. కొందరు వ్యక్తులు వెంటపడి మరీ రాళ్లను విసిరేశారు. దాంతో.. ప్రణత్‌ టుడుతో పాటు భద్రతా సిబ్బంది, మీడియా సిబ్బంది కూడా పరుగు తీయాల్సి వచ్చింది. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాకగా.. కొన్ని పోలింగ్‌ బూత్‌లలోకి బీజేపీ ఏజెంట్లను అనమతించడం లేదని సమాచారం అందింది. దాంతో.. ప్రణత్ టుడు గర్బేటాకు వెళ్లారు. అప్పుడే ప్రణత్‌పై రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అకస్మాత్తుగా రోడ్లను దిగ్భందించి.. టీఎంసీ గుండాలే తన కారుపై ఇటుకలు, రాళ్లను విసిరారని ప్రణత్‌ టుడు చెప్పినట్లు పీటీఐ సంస్థ వెల్లడించింది. ఇక తనని రక్షించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినప్పుడు వారు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇద్దరు CISF జవాన్ల తలకు గాయాలు అయ్యాయనీ.. వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు.

అయితే.. ఓటు వేయడానికి వచ్చిన మహిళపై ప్రణత్‌ టుడు భద్రతా సిబ్బంది దాడి చేశారని టీఎంసీ చెబుతోంది. ఈ క్రమంలోనే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారని వెల్లడించింది. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది టీఎంసీ. ఇక చివరకు మీడియా సంస్థ సిబ్బందిపైనా జనాలు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారని పీటీఐ సంస్థ చెప్పింది.


Next Story