లోక్‌సభ ఎన్నికలు ముందే వచ్చే చాన్స్: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 4:24 PM ISTలోక్‌సభ ఎన్నికలు ముందే వచ్చే చాన్స్: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ఈసారి ముందు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారమె. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే.. ఎన్నికలు ముందుగానే వస్తాయని చెప్పడానికి ఆమె కారణం కూడా చెప్పారు. బీజేపీ నాయకులు ఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను బుక్ చేసకున్నారని మమతా బెనర్జీ తెలిపారు.
టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్బంగానే లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లోనే సార్వత్రిక ఎన్నికలు ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇక నిరంకుశ పాలనే ఉంటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోపార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వొద్దని బీజేపీ అగ్రనాయకులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికామని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని తప్పకుండా ఓడిస్తామని మమతా బెనర్జీ అన్నారు. విభజించు పాలించు అన్నట్లుగా బీజేపీ వ్యవహరం ఉందని.. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక మరోసారి బీజేపీ అధికారం చేపడితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ తీరుపై కూడా సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాల్‌కు దిగొద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉందని.. కానీ.. బెంగాల్‌లో ఆయన వ్యవహారం మాత్రం బాలేదని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.