బీజేపీని ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 11:43 AM ISTబీజేపీని ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా వస్తాయో రావో అన్న అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. మరికొద్ది నెలల్లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. బీజేపీని ఎలాగైనా గద్దె దించి తాము అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మొన్నటి వరకు టీఎంసీ, కాంగ్రెస్ మిత్రపక్షలుగా ఉన్నాయి. అయితే.. సీట్ల పంపకాల విషయంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ తీరుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ.. కూటమి నుంచి బయటకు వస్తున్నారు. బెంగాల్‌లో 42 సీట్లలో రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఆఫర్ చేస్తే..వారు ఒప్పుకోలేదని అన్నారు మమతా బెనర్జీ. మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. దాంతో.. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తాము పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మమతా వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు రెండు కాదు.. మొత్తం 42 సీట్లలో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం దొరికిందని అన్నారు. మరోవైపు దేశంలో మొత్తం 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని తాను సూచించినట్లు మమత చెప్పారు. కానీ కాంగ్రెస్ దానికి సిద్ధంగా లేదన్నారు. బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదన్నారు.
కాంగ్రెస్‌తో మమతకు ఎలాంటి విభేదాలు లేవని.. ఇండియా కూటమిలోనే దీదీ కొనసాగుతారని శుక్రవారం రాహుల్‌గాంధీ చెప్పారు. సీట్ల పంపకాల విషయంలో ఉన్నవి చిన్నచిన్న సమస్యలు అనీ.. అవన్నీ త్వరలోనే పరిష్కరించుకుంటామని రాహుల్‌గాంధీ అన్నారు. కాగా.. ఆయన ఈ కామెంట్స్ చేసిన కాసేపటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.