ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ ఎంపీ.. రాజుకున్న వివాదం

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో హడావుడి కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 10:30 AM GMT
bengal, bjp, mp khagen murmu,

ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ ఎంపీ.. రాజుకున్న వివాదం

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో హడావుడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్చారంలో దూసుకెళ్తున్నారు. వ్యూహాలను అమలు చేస్తున్నారు. పోలింగ్‌ దగ్గర పడుతున్న క్రమంలో పలు చోట్ల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రచారంలో కొందరు నేతలు విభిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల పనులు చేస్తూ కనిపిస్తారు. చాయ్‌ పెట్టడం.. కుండలు తయారు చేయడం.. హోటల్‌లో ఫుడ్‌ను వండటంతో పాటు ఇతర పనులు చేస్తూ ప్రచారం చేస్తుంటారు. తాజాగా ఓ బీజేపీ ఎంపీ కూడా ప్రచారంలో భిన్నంగా ప్రవర్తించారు. అయితే.. అతను చేసిన పని వివాదంలో పడేసింది. బెంగాల్‌ నార్త్‌ బల్దా నియోజకవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మరోసారి అదే స్థానం నుంచి టికెట్‌ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలుస్తూ చేతులు కలుపుతూ.. ముద్దులు పెడుతూ ప్రచారం చేశారు. ఓ యువతి చెంపపై కూడా ముద్దు పెట్టాడు ఎండీ ఖగేన్‌. చంచల్‌ శ్రిహిపూర్‌ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వార్త, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రత్యర్థి పార్టీ నాయకులు ఈ సంఘటనపై స్పందిస్తూ ఎంపీ ఖగేన్‌ ముర్ముపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదువ లేదంటూ తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసే నేతలు, బీజేపీ శిబిరంలో మహిళా వ్యతిరేక నాయకులు చాలా మంది ఉన్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మహిళలకు మోదీ పరివార్‌ ఇస్తోన్న గౌరవం ఇదేనంటూ మండిపడింది. ఒకవేళ వీరు అధికారంలోకి వస్తే మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవాలంటూ ఎక్స్‌ వేదికగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పోస్టు పెట్టింది.

ఇక ఇదే సంఘనపై బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము స్పందించారు. తన చర్యను సమర్ధించుకున్నారు. ఆ యువతిని తన కుమార్తెలా భావించానని చెప్పారు. అందుకే ముద్దు పెట్టినట్లు వివరించారు. పిల్లలకు ముద్దు పెట్టడం తప్పు కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కుట్రపూరితంగా ఎన్నికల వేళ లబ్ధి పొందేందుకు కొందరు నాయకులు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఖగేన్ ముర్ము అన్నారు.

Next Story