మందుబాబులకు చేదు వార్త. మండుటెండల్లో ఓ చల్లటి బీర్ తాగి చిల్ అవుదామనుకుంటున్న బీర్ ప్రియులకు షాక్ ఇచ్చేందుకు తయారీ కంపెనీలు సిద్దమయ్యాయి. బీర్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచాలని యోచిస్తున్నాయి. బీర్ తయారీకి ఉపయోగించే బార్లీ సహా ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరుగుతుండడమే అందుకు కారణం.
బీర్ తయారీకి ఉపయోగించే బార్లీ ధర గత సంవత్సర కాలంలో 65 శాతం పెరిగింది. దీనికి తోడు పెరుగుతున్న రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో డిస్టిలరీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో బీర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుందని బీరా 91 బీర్ల తయారీ సంస్థ సీఈవో అంకూర్ జైన్ అంటున్నారు. ఇప్పటికే కొన్ని మార్కెట్లలో ధరలను పెంచినట్లు ఆయన చెప్పారు.
కాగా.. దేశంలో బీర్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాలు బీర్ల రేట్ల ను పెంచగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించనున్నాయి. అయితే.. ఏడాది మొత్తంలో జరిగే అమ్మకాల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వేసవి కాలమైన మార్చి నుంచి జులై లో జరుగుతాయి. ఈ సమయంలో రేట్లను పెంచితే.. దీని ప్రభావం అమ్మకాలపై పడే అవకాశం ఉంది.