18 ఏళ్ల లోపు వారు మొబైల్ ఫోన్లు వాడకంపై నిషేదం
Bansi Gram Panchayat Bans Use of Smartphones for Under 18 Boys and Girls.మహారాష్ట్రలోని బన్సీ గ్రామ ప్రజలు
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2022 1:43 PM ISTమొబైల్.. ఇది ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైంది. మొబైల్ లేకుండా కనీసం ఓ పది నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు ఎంతో మంది. మొబైల్ ఫోన్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ మరికొన్ని నష్టాలు కూడా ఉంటున్నాయి. పాఠశాలలు, కాలేజీల నుంచి వచ్చిన చిన్నారులు చదువును పక్కకు పెట్టి ఫోన్లకు అంకితమైపోతున్నారు. చిన్నారులను ఫోన్లకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడడం లేదు. మొబైల్స్ మానవ సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలోని బన్సీ గ్రామప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామంలో 18 ఏళ్ల లోపు వారు మొబైల్ వాడటంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నిర్ణయాన్ని గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తల్లిదండ్రులు తప్పకుండా ఈ రూల్‌ని పాటించాలని, ఉల్లఘించిన వారిపై పెనాల్టీలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
బన్సీ సర్పంచ్ గజానన్ టేల్ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలు చదువులు ఆన్‌లైన్‌లో కొనసాగినందున మొబైల్ ఫోన్లకు వారు అలవాటు అయ్యారు. దురదృష్టవశాత్తు యుక్త వయస్కులకు మొబైల్ అనివార్యమైంది వారు దానికి బానిసలయ్యారు. కొందరు చిన్నారులు అశ్లీల వీడియోలు చూడడానికి అలవాటు పడ్డారు. వారు చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకు దీనిపై అవగాహన కల్పించామని, అందుకే నవంబర్ 11న జరిగిన గ్రామసభలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించామని గజానన్ టేల్ చెప్పారు. ఎవరైనా నిషేధ నియమాన్ని ఉల్లంఘిస్తే.. అతనికి/ఆమెకు రూ. 200 జరిమానా విధించనున్నట్లు చెప్పారు.
గ్రామస్థులు నితిన్ డాంగే, ఆశిష్ దేశ్‌ముఖ్, ఇతరులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు, దీని వల్ల పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టడానికి తగిన సమయం ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు ఇదొక అద్భుతమైన ముందడుగు అని ఆశిష్ అన్నాడు. తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
కాగా.. రాష్ట్రంలో మొబైల్‌ని నిషేధిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి గ్రామం ఇదే కావచ్చు.