బెంగళూరులో నీటి కొరత.. హోలీపై ప్రభుత్వం ఆంక్షలు

బెంగళూరులో నీటి కష్టాలు మరింత పెరగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 7:00 PM IST
bangalore, water crisis,  government, restrictions,  holi,

బెంగళూరులో నీటి కొరత.. హోలీపై ప్రభుత్వం ఆంక్షలు 

బెంగళూరులో నీటి కష్టాలు మరింత పెరగుతున్నాయి. నీటి సంక్షోభంతో తాగు నీరు సరిపడినంత దొరక్క నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల కోసం బారులు తీరుతున్నారు. రెండు వారాలుగా బెంగళూరులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందనీ కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రజలు అవసరం మేరకే నీటిని వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే.. కర్ణాటక ప్రభుత్వం నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని కీలక ఆదేశాలను జారీ చేసింది. హోలీ పండగ జరనున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలను విధించారు. పూల్‌ పార్టీలు, రెయిన్‌ డ్యాన్స్‌లను నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. బోర్‌వెల్‌ నీటిని కూడా హోలీ వేడుకులకు వాడుకోవద్దు అని ఆదేశాలను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధారామయ్య ప్రభుత్వం హెచ్చరించింది. బెంగళూరులో రోజుకు దాదాపుగా 2600 మిలియన్ లీటర్ల నీటి వినియోగం జరుగుతోంది. కాని ప్రస్తుతం 2వేల మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగులుగుతున్నారు అధికారులు. నీటి కొరత కారణంగా ఇంతకు మించి ఇంకే చేయలేమని వాటర్ బోర్డు కూడా చేతులు ఎత్తేసింది.

దాంతో.. బెంగళూరు ప్రజలకు నీటి కొరత ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కర్ణాటక ప్రభుత్వం హోలీ వేడుకలపై ఆంక్షలను విధించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల పండుగపై ఆంక్షలు ఏంటని మండిపడుతున్నాయి.

ఐపీఎల్‌ మ్యాచ్‌లపై కూడా నీటి కొరత ఎఫెక్ట్

బెంగళూరులో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లపై కూడా నీటి కొరత ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. మార్చి 25, మార్చి 29తో పాటు ఏప్రిల్ 2న బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దాంతో రోజుకు 75వేల లీటర్ల నీళ్లు స్టేడియానికి అవసరం అని కర్ణాటక క్రికెట్ బోర్డు తెలిపింది. నీటి కొరత కారణంగా తాము అన్ని నీళ్లను ఇవ్వలేమనీ.. స్టేడియాన్ని తడిపేందుకు శుద్ధి చేసిన మురికి నీటిని వాడాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం చెప్పిన ఈ విషయంపైనా కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Next Story