బాంబు పేలుడు తర్వాత తిరిగి తెరుచుకున్న రామేశ్వరం కేఫ్

కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల క్రితం కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on  10 March 2024 2:15 AM GMT
bangalore, rameshwaram cafe, re-open, karnataka,

బాంబు పేలుడు తర్వాత తిరిగి తెరుచుకున్న రామేశ్వరం కేఫ్

కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల క్రితం కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంఘటన జరిగింది. ఈ బాంబు దాడి తర్వాత నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే.. అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. దాంతో.. అతని ఫొటోలను విడుదలచేస్తూ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అంటూ ప్రకటనలు ఇచ్చారు. కాగా.. పేలుడు తర్వాత రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే పూర్తి మరమ్మతులు చేసి కేఫ్‌ను యథావిధిగా ప్రారంభించింది యాజమాన్యం. కేఫ్‌ను తెరుస్తున్న సమయంలో జాతీయ గీతం ఆలపించి జాతీయ స్ఫూర్తిని చాటుకుంది యాజమాన్యం.

కేఫ్‌లో మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు యజమాని రాఘవేంద్రరావు. కేఫ్‌కు వచ్చే వారిని తనిఖీ చేయడానికి కేఫ్‌ ఎంట్రీ ద్వారం వద్ద మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఎవరి కార్యకలాపాలు ఉన్నా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు సెక్యూరిటీ సిబ్బంంది. ఈ మేరకు రామేశ్వరం కేఫ్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత యజమాని రాఘవేంద్రరావు మాట్లాడారు.. ఏదైతే జరగొద్దని భావించామో అదే జరిగిందని అన్నారు. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠమని చెప్పారు. శివుడి ఆశీస్సులతో శివరాత్రి సందర్భంగా కేఫ్‌ను తిరిగి ప్రారంభించామని అన్నారు. శనివారం జాతీయ గీతం ఆలపిస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరిచామని అన్నారు. ఇక కేఫ్‌ వద్ద భారీ సెక్యూరిటీ ఉంటుందని ఆయన చెప్పారు. తమ సెక్యూరిటీ సిబ్బందికి విశ్రాంత సైనికులతో శిక్షణ ఇప్పటించనున్నట్లు తెలిపారు. మరోవైపు పేలుడుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని దర్యాప్తు సంస్థలకు అందించామని యజమాని రాఘవేంద్రరావు తెలిపారు. కాగా.. కేఫ్‌ను పూలతో అలకరించి పూజలు చేశారు. ఈ కేఫ్‌ను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా అక్కడ పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈ పేలుడు సంఘటనపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. పేలుడుకి పాల్పడ్డ నిందితుడి ఫొటోలను కూడా ఎన్‌ఐఏ విడుదల చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అతని ఆచూకీ తెలిపితే రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story