కర్ణాటకలో కొనసాగుతున్న బంద్..మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు

కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. సాధరణ జన జీవనానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 Sep 2023 7:15 AM GMT
bandh, Karnataka, flights, schools shut, protests,

కర్ణాటకలో కొనసాగుతున్న బంద్..మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు

కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. రైతు సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్‌ కర్ణటకలో ఉదృతంగా కొనసాగుతోంది. బంద్‌ కారణంగా సాధరణ జన జీవనానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బంద్‌కు మద్దతుగా నగరంలోని హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

బంద్ తో ఎక్కువ ప్రభావం బెంగళూరు నగరంపైనే పడింది. ప్రజల రవాణాకు అవరోధం ఏర్పడింది. కన్నడ ఒక్కుట సంస్థ కార్యకర్తలు విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో బంద్‌ దృష్ట్యా చాలా మంది ప్రయాణికులు తమ విమానప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. దాంతో.. ఆయా సంస్థలు విమానాలను కూడా రద్దు చేశాయి. క్యాబులు అందుబాటులో లేక పలువురు విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోవడంతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు రద్దు నిర్ణయం తీసుకున్నాయి. బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 44 విమానాలను అధికారులు రద్దు చేశారు. బంద్‌ కారణంగా అధికారులు విమానాల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే అందజేశారు.

మరోవైపు ఈ బంద్‌కు కర్ణాటక రక్షణ వేదికె, హసిరు సేన, జయ కర్ణాటక సంఘం సహా మొత్తం 1,900 సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్‌ పాటిస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంపై బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. బంద్ ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు తోపాటు మైసూర్, మాండ్య ప్రాంతాల్లో బంద్ కారణంగా ప్రజా జీవనం స్తంభించింది. నిరసనకారులు పలుప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల నిరసనకారులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. కర్ణాటకలో ఈ బంద్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Next Story