మరో రాష్ట్రంలోనూ పీచు మిఠాయిపై బ్యాన్‌

తాజాగా పీచు మిఠాయి అమ్మకాలను హిమాచల్‌ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 4:14 PM IST
ban,  peechu mithai, himachal pradesh, government,

మరో రాష్ట్రంలోనూ పీచు మిఠాయిపై బ్యాన్‌ 

మిఠాయిలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. స్వీట్సుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ.. పీచు మిఠాయికి ఉన్న క్రేజ్‌ వేరు. దీని పేరు వింటే చాలు చాలా మంది తినాలని అంటారు. చిన్న పిల్లలు అయితే ఎక్కువగా దీన్ని ఇష్టపడతారు. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఎంతో మందికి ఇష్టమైన ఈ పీచుమిఠాయిపై పలు రాష్ట్రాల్లో బ్యాన్‌ విధిస్తున్నారు. పీచు మిఠాయి తయారీ కోసం వినియోగించే వాటిల్లో క్యాన్సర్‌కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. దాంతో.. పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే బ్యాన్ విధించాయి. తాజాగా ఈ రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్‌ కూడా చేరింది.

తాజాగా పీచు మిఠాయి అమ్మకాలను హిమాచల్‌ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మే 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను ఆహార భద్రత అధికారులు పరీక్షించారు. ఆ తర్వాత పీచు మిఠాయిల్లో రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత పరిమాణాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇక ఆహార భద్రత అధికారుల నివేదిక ఆధారంగా హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయిలను అమ్మడంపై నిషేధం విధించింది. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి దుష్ప్రభావం చూపుతాయని తెలియడంతో బ్యాన్ విధించారు.

Next Story