దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

Bakrid celebrations are grand across the country. బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు

By అంజి  Published on  10 July 2022 10:28 AM IST
దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు వద్దకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలివచ్చారు. ఈద్‌గాహ్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఇక హైదరాబాద్‌లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు మక్కా మసీదుకు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయడానికి మనలో స్పూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. బక్రీద్ పండుగ త్యాగం, సేవకు చిహ్నంగా నిలుస్తుందని, సేవకు మనల్ని మనం అంకితం చేసుకుని దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేమైంది. ఈ పండుగను 'ఖుర్బీనా పండుగ' లేదా 'ఈద్‌ అల్‌ అధా' అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకుంటున్నారు. యెమెన్, కెన్యా, ఈజిప్ట్‌, లిబియా, ఆప్ఘానిస్తాన్ దేశాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నడుమ గడిపిన ప్రజలు ఇప్పుడు సామూహిక ప్రార్థనలు, వేడుకలు జరుపుకోవడం ఊరటినిస్తోంది.

బక్రీద్ పండుగ ప్రాముఖ్యత

ఖురాన్‌ ప్రకారం… అల్లాహ్‌ అత్యంత ప్రీతిపాత్రంగా ప్రేమించే ఇబ్రహీం దంపతులకు 80 ఏళ్లు దాటినా సంతానం కలగలేదు. చుట్టుపక్కలవారు ఇబ్రహీం దంపతులను హేళన చేసేవారు. ఒకరోజు అల్లాహ్ ఇబ్రహీం కలలో కనిపించి.. నీకు ఏం కావాలి అని అడుగుతాడు. సంతానం కావాలనడంతో మూస అనే కొడుకును ఇబ్రహీంకు అల్లాహ్ ప్రసాదిస్తాడు. కొన్నేళ్ల తర్వాత దేవుడు ఇబ్రహీం నిజాయితీని పరీక్షించేందుకు అత్యంత ఇష్టమైన దాన్ని తనకు బలి ఇవ్వాలని కోరతాడు. తనకు అత్యంత ప్రీతికరమైనది తన కొడుకేనంటూ, అంతకంటే విలువైనది ఏదీ లేదంటూ ఇబ్రహీం దేవుడికి విన్నవిస్తాడు. దేవుడి కోరిక మేరకు కొడుకును సైతం బలి ఇవ్వడానికి ఇబ్రహీం సిద్ధపడతాడు. ఇబ్రహీం త్యాగాన్నిమెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగం వద్దని ఏదైనా జీవిని బలి ఇవ్వాలని కోరతాడు. అనంతరం ఇబ్రహీం గొర్రె పిల్లను బలి ఇస్తాడు. నాటి నుండి ముస్లింలు అల్లాను పూజించే క్రమంలోనే గొర్రెను బలి ఇచ్చి మాంసాన్ని ఇతరులకూ వితరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే పూర్వం నుంచి బక్రీద్‌ పండగగా జరుపుకుంటున్నారు.

Next Story