క్షమాపణ చెప్పకపోతే 1000 కోట్ల దావా

Baba Ramdev gets Rs 1000 crore defamation notice for remarks on allopathy. రామ్‌దేవ్‌కు వెయ్యి కోట్ల పరువు నష్టం నోటీసును పంపింది.

By Medi Samrat
Published on : 26 May 2021 4:02 PM IST

Baba Ramdev

అల్లోపతి వైద్యాన్ని కించపరిచే విధంగాయోగా గురు రామ్‌ దేవ్‌ బాబా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు రేపిన దుమారం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొవడంతో రామ్‌దేవ్‌ వెనక్కు తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మరో ప్రకటన విడుదల చేశారు. అయినా సరే ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. అంతటితో ఆగకుండా ఉత్తరాఖండ్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు వెయ్యి కోట్ల పరువు నష్టం నోటీసును పంపింది. రామ్‌దేవ్‌ చేసిన స్టేట్‌మెంట్‌ తప్పని చెబుతూ ఒక వీడియో చేయటం తో పాటుగా 15 రోజుల్లో రాత పూర్వక క్షమాపణ చెప్పకపోతే ఏకంగా 1000 కోట్లను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. అంతే కాదు అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరాథ్‌ సింగ్‌ రావత్‌కు లేఖ రాసింది. మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు కూడా బాబా రాందేవ్ స్టేట్ మెంట్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు.

అల్లోపతి ఒక స్టూపిడ్‌ సైన్స్‌ అని, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆమోదించిన రెమిడెసివర్‌ తో పాటు పలు ఇతర ఔషధాలు..కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యాయంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో డాక్టర్ల సంఘాలు బాబాపై మండి పడ్డాయి. బాబా వ్యాఖ్యలపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ లేఖ కూడా రాసారు. దీంతో బాబా రామ్ దేవ్ బాబా తన వాఖ్యలు ఉపసంహరించుకున్నారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి కొత్తగా 25 ప్రశ్నలను సంధించారు. బీపీ, డయాబెటిస్ వంటివాటికి ఆలోపతీలో శాశ్వత చికిత్స ఉందా అని, అలాగే ఆస్త్మా, కీళ్లనొప్పులు వంటి రుగ్మతలకు ఫార్మా ఇండస్ట్రీ వద్ద శాశ్వత చికిత్సా విధానం ఉందా అంటూ ఎన్నో ప్రశ్నలు సంధించారు.





Next Story