బాబా కా దాబా ఓనర్ ఆత్మహత్యాయత్నం
Baba Ka Dhaba Owner Kanta Prasad Attempts Suicide.కరోనా మహమ్మారి తొలి వేవ్ సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియోతో
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి తొలి వేవ్ సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన ఢీల్లిలోని బాబా కా దాబా యజమాని కాంతాప్రసాద్(81) గుర్తున్నాడు కదా.. ఆయనకు ఎంత కష్టం వచ్చిందో ఏమో కానీ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పెట్టుకున్న రెస్టారెంట్ నష్టాల్లో మునిగిపోవడంతో వీరు మళ్లీ తన పాత హోటల్ వైపే మొగ్గారు. అయితే.. ఆంక్షలు, హోటల్ నష్టాలకు భరింలేక ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. తన తండ్రి నిద్రమాత్రలు తీసుకున్నారని కాంతాప్రసాద్ కుమారుడు కరణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Delhi | Kanta Prasad, 80 y/o owner of 'Baba Ka Dhaba' was admitted to Safdarjung Hospital last night. He had brought in an unconscious condition after he consumed alcohol & sleeping pills. Statement of his son has been recorded for the same. Probe on: DCP South Atul Thakur
— ANI (@ANI) June 18, 2021
దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్‌లో రోడ్డు పక్కన కాంతా ప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి చిన్నహోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఆర్థిక సాయం చేయడంతో పాటు ఎంతో మంది ఆ చిన్న కొట్టు వద్దకు వచ్చి భోజనం చేశారు. మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు. రూ.5 లక్షల అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచినా.. తరువాత గిరాకీ లేక నష్టాలు వస్తుండడంతో దానిని మూసేసారు. తిరిగి మళ్లీ తన పాత హోటల్‌నే నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాంతా ప్రసాద్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చింది? ఆర్థిక సమస్యలా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.