మకర సంక్రాంతి సందర్భంగా గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలోని రామాలయాన్ని జనవరి 2024లో భక్తుల కోసం తెరవనున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎంపిక చేసిన జర్నలిస్టుల బృందంతో మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలను తట్టుకోగలదని, 1,000 సంవత్సరాలకు పైగా ఉండేంత ధృడమైనది. రూ.1800 కోట్లతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని చంపత్ రాయ్ తెలిపారు.
392 స్తంభాలు, 12 తలుపులు ఉండే ఈ ఆలయాన్ని ఇనుప కడ్డీలు ఉపయోగించకుండా నిర్మిస్తున్నారు. రాళ్లను కలిపేందుకు ఇనుముకు బదులు కాపర్ చిప్స్ వాడుతున్నారని తెలిపారు. గర్భగుడిలో 160 స్తంభాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 82 ఉంటాయి. మొత్తంగా, ఈ నిర్మాణంలో టేకు చెక్కతో చేసిన 12 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. మొదటి అంతస్తులో గంభీరమైన ప్రధాన ద్వారం ఉంటుంది. నిగూఢమైన మంటపాలు ఉంటాయి. ప్రధాన ఆలయ పరిమాణం 350x250 అడుగులు ఉంటుంది.
ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకు.. ఆలయాన్ని తెరిచిన తర్వాత దాని చుట్టూ ఉన్న ఐదు కి.మీ-ప్రాంతంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. "పని యొక్క వేగం, నాణ్యతతో మేము సంతృప్తి చెందాము" అని ఆయన చెప్పారు. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన గ్రానైట్ రాళ్లను ఉపయోగిస్తున్నారు. రామనవమి రోజున రామ్ లల్లా విగ్రహంపై సూర్యకిరణాలు పడే విధంగా గర్భగుడిని నిర్మించినట్లు ప్రాజెక్ట్ మేనేజర్ జగదీష్ అఫాలే తెలిపారు.