అయోధ్యలో బాలరాముడి దర్శన సమయాలు ఇవే..
మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 11:34 AM GMTఅయోధ్యలో బాలరాముడి దర్శన సమయాలు ఇవే..
అయోధ్యలో రామమందిరం ప్రారంభం అయ్యింది. చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. 500 ఏళ్ల తర్వాత హిందువల కల సాకారమైంది. రామజన్మ భూమిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ క్రతువు జరిగింది. వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు.
మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోదీ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్న్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ప్రాణప్రతిష్ట సమయంలో హెలికాప్టర్‌లో వచ్చిన ఆర్మీ రామమందిరంపై పూల వర్షం కురిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ పట్టువస్త్రాలు తీసుకొచ్చి బాలరాముడికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా రాముడి ప్రతిరూపాన్ని అద్దంలో ప్రధాని మోదీ వీక్షించారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామనామ స్మరణతో అయోధ్య మార్మోగింది. జైశ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించిపోయారు. ఆభరణాలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ఉంది. బాలరాముడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల కాగా.. వాటాని చూసిన భక్తులు తరించి పోతున్నారు.
అయితే.. అయోధ్యలో రామమందిరంలో బాలరాముడు కొలువుదీరారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా.. సామాన్యుల దర్శనాల కోసం టైమ్‌స్లాట్‌ను కేటాయించారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు.