సామాన్యులపై మరో పిడుగు.. డిసెంబర్ 1 నుంచి ఆటో ఛార్జీల పెంపు
Auto rides in Bengaluru to cost more after December 1.దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్
By తోట వంశీ కుమార్
దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వీటి ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఓ వైపు వంటగ్యాస్ ధర కొండెక్కుతుండగా.. ఇప్పుడు మరో పిడుగు ప్రజలపై పడనుంది. ఆటో చార్జీలు కూడా పెరగనున్నాయి. ఇందుకు ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచుతూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇది మన దగ్గర కాదులెండి. పక్కనే ఉన్న బెంగళూరు నగరంలో. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత అక్కడ ఆటో చార్జీలు పెరగనున్నాయి.
ఇప్పటి వరకు మొదటి 1.9 కిలోమీటర్ల వరకు చార్జీ రూ.25 ఆతరువాత ప్రతి కిలోమీటరు రూ.13చొప్పున వసూలు చేశారు. అయితే.. డిసెంబర్ 1 నుంచి మొదటి రెండు కిలోమీటర్ల వరకు రూ.30 ఆ తరువాత ప్రతి కిలోమీటరుకు రూ.15 వసూలు చేయనున్నారు. 20కిలోల లగేజీ వరకు ఉచితం. ఆపై లగేజీకి రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. 50 కేజీల లగేజీ వరకే అనుమతి ఉంది. అదేవిధంగా.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొదటి 5 నిమిషాల వరకు ఎలాంటి వెయిటింగ్ ఛార్జీలు వసూలు చేయరు. ఆ తరువాత ప్రతి 15 నిమిషాలకు రూ.5 వసూలు చేయనున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక పెంచిన ధరలు ప్రయాణీకులకు తెలిసేలా వాహనంలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆటో చార్జీల పెంపుపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోల కంటే సైకిల్‌పై లేదా నడిచి వెళ్లడమే ఉత్తమమని అంటున్నారు.