Manipur: ముఖ్యమంత్రికి చెందిన ఇంటిపై దాడి
తాజాగా మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌కు చెందిన ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 7:44 AM ISTManipur: ముఖ్యమంత్రికి చెందిన ఇంటిపై దాడి
మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ రాష్ట్రమంతా అగ్నిగుండంలా మారింది. మెయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రెండ్రోజుల క్రితం మెయిటీ వర్గానికి చెందిన ఇద్దరిని మెలిటెంట్లు చంపారని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో.. మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌కు చెందిన ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి. ఆ ఇంటిపై దాడిచేసే ప్రయత్నాలు చేశాయి.
అయితే.. మెయిటీ విద్యార్థుల హత్యపై ఇంఫాల్ లోయలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి చెందిన ఇంటిపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఇంఫాల్ శివార్లలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది. విద్యార్థుల హత్యలను ఖండిస్తూ.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తెల్లవారుజామునే ఇంఫాల్‌లోని సీఎంకు సంబంధించిన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ లోయలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా.. నిరసనకారులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. సీఎంకు చెందిన ఇంటిపై దాడి చేశారు. కాగా.. సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్ నగరంలోని మధ్యలో ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన నివాసంలో ఉంటున్నారు.
సీఎంకు చెందిన ఇంటిపై దాడి ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. భద్రతా బలగాలు ఆ గుంపుని 100-150 మీటర్ల దూరంలో అడ్డుకున్నారని చెప్పారు. దాడికి యత్నించిన వారిని చెదరగొట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కానీ.. కొందరుమాత్రం ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. కాగా.. ఇంట్లో దాడి సమయంలో ఎవరూ లేరని వెల్లడించారు. అయినా 24 గంటల పాటు భద్రత కల్పిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.