ఆధార్‌ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించింది: అస్సాం సీఎం

అస్సాం రాష్ట్రంలో అక్రమ వలసదారులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2024 8:25 AM IST
ఆధార్‌ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించింది: అస్సాం సీఎం

అస్సాం రాష్ట్రంలో అక్రమ వలసదారులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఇందులో భాగంగా ఆధార్ కార్డుల కోసం కొత్త దరఖాస్తుదారులు తమ జాతీయ పౌర రిజిస్టర్ (NRC) దరఖాస్తు రసీదు నంబర్‌ను సమర్పించాలని ప్రకటించారు. ఆధార్ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించిపోయిందని అన్నారు. మోసపూరిత దరఖాస్తుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం నాలుగు జిల్లాల్లో అంచనా వేసిన జనాభాను మించి ఆధార్ కార్డుదారులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

జనాభా కంటే ఆధార్ కార్డుల కోసం దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని... అనుమానాస్పద పౌరులు ఉన్నారని ఇది సూచిస్తోందని చెప్పారు హిమంత బిస్వా వర్మ. కొత్త దరఖాస్తుదారులు తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్‌ను సమర్పించాలని నిర్ణయించామని చెప్పారు. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తుల రాకను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. అస్సాంలో ఆధార్ పొందడం అంత సులభం కాదనీ.. కొత్త ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్రం కఠినతరం చేస్తుందని హిమంత బిస్వా శర్మ చెప్పారు.

రాష్ట్రంలోని ధుబ్రీ జిల్లాలో జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డులు జారీ అయ్యాయాని ఆయన అన్నారు. కొంతమంది అనుమానిత వ్యక్తులు ఆధార్ కార్డులు పొందారని అన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి 10 రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. "మీరు NRC కోసం దరఖాస్తు చేయకపోతే, కొత్త ప్రక్రియలో మీకు ఆధార్ కార్డ్ లభించదు" అని శర్మ చెప్పారు. అయితే, టీ గార్డెన్ ప్రాంతాలకు ఈ నిబంధన వర్తించదని, వయోజన దరఖాస్తుదారుల కోసం ఇతర జిల్లాల్లో అక్టోబర్ 1 నుండి కఠినమైన నియమాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను గుర్తించే ప్రయత్నాలను తీవ్రతరం చేయడంలో తమ ప్రభుత్వ నిబద్ధతను గుర్తు చేశారు. గత రెండు నెలలుగా బంగ్లాదేశ్ నుండి అనేక మంది వ్యక్తులు పట్టుబడి అధికారులకు అప్పగించబడ్డారని వెల్లడించారు.

Next Story