జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వైద్యులు తొలిసారిగా ఇన్సులిన్ అందించారు

By Medi Samrat  Published on  23 April 2024 9:25 AM IST
జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వైద్యులు తొలిసారిగా ఇన్సులిన్ అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల ప్రకారం.. జైలులో సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవెల్ త‌రుచుగా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ షుగర్ లెవల్ 320కి చేరుకుంది.

ఇదిలావుంటే.. సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుండి మరో దెబ్బ తగిలింది. ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వైద్యులను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

ఇక కేజ్రీవాల్ ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండిస్తున్నారు. AIIMS నుండి నిపుణులతో వీడియో సంప్రదింపుల సందర్భంగా.. ఇన్సులిన్ సమస్య లేదా దాని ఆవశ్యకత గురించి లేవనెత్తలేదని పేర్కొంది. అయితే.. డాక్టర్లను సంప్రదించిన స‌మ‌యంలో ఇన్సులిన్ సమస్యను తాను ఎప్పుడూ లేవనెత్తలేదన్న జైలు అధికారుల వాదనను కేజ్రీవాల్ వ్య‌తిరేకించారు. 10 రోజుల వ్యవధిలో ఇన్సులిన్ డిమాండ్ సమస్యను నిరంతరం లేవనెత్తాన‌ని నొక్కి చెప్పారు.

“ముఖ్యమంత్రి చెప్పినది నిజమేనని.. ఆయనకు ఇన్సులిన్ అవసరమని ఈరోజు స్పష్టమైంది. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆయనకు చికిత్స చేయడం లేదు. చెప్పండి బీజేపీ వాళ్లు! ఇన్సులిన్ అవసరం లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ప్రపంచం మొత్తం వారిని శపిస్తోంది' అని ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్ అన్నారు.

కేజ్రీవాల్ వైద్య అవసరాలను, ముఖ్యంగా ఇన్సులిన్‌కు సంబంధించి అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సిటీ కోర్టు AIIMSని ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారం, డాక్టర్ సూచించిన ఆహారం.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆహార నియమావళి మధ్య వ్యత్యాసాలను కోర్టు హైలైట్ చేసింది.

Next Story