ఆటోవాలా ఆహ్వానం.. ఆటోలోనే ఇంటికి వెళ్లి భోజ‌నం చేసిన సీఎం

Arvind Kejriwal dinner at auto driver residence.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ రోజు రాత్రి ఓ ఆటో డ్రైవర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2021 11:40 AM IST
ఆటోవాలా ఆహ్వానం.. ఆటోలోనే ఇంటికి వెళ్లి భోజ‌నం చేసిన సీఎం

వ‌చ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ అధికారాన్ని ద‌క్కించుకునేందుకు ఆమ్ఆద్మీ(ఆప్‌) గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం లుథియానాలో ప‌ర్య‌టించిన సీఎం కేజ్రీవాల్.. అక్క‌డ స్థానిక ఆటో డ్రైవ‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆటో డ్రైవ‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం స‌మాధానం ఇస్తున్నారు. ఇంత‌లో దిలీప్ తివారీ అనే ఓ ఆటో డ్రైవ‌ర్.. "స‌ర్ నేను మీకు పెద్ద అభిమానిని. మీరు చాలా మంది ఆటో డ్రైవ‌ర్ల‌కు సాయం చేశారు. ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజ‌నానికి రాగ‌ల‌రా..? ఇది నేను మీకు హృద‌య‌పూర్వ‌కంగా చేస్తున్న ఆహ్వానం" అని అన్నాడు.

దీనికి కేజ్రీవాల్ వెంట‌నే స్పందించారు. "త‌ప్ప‌కుండా.. ఈ రోజు రాత్రికి ఓకేగా..?" అని అడిగారు. త‌న‌తో పాటు భ‌గ‌వంత్ మ‌న్‌, హ‌ర్పాల్ సింగ్‌ను కూడా తీసుకురావొచ్చా..? అని సీఎం కేజ్రీవాల్ ఆటో డ్రైవ‌ర్ దిలీప్‌ను అడిగారు. ఎంత‌గానో సంతోష‌ప‌డిపోయిన దిలీప్ త‌ప్ప‌కుండా సార్ అని స‌మాధానం ఇచ్చాడు. దీంతో ఆ స‌మావేశ మందిరం చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. స‌మావేశం అనంత‌రం దిలీప్ తివారీ ఆటోలోనే కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్‌, హ‌ర్పాల్ సింగ్.. అత‌డి ఇంటికి వెళ్లారు. కాసేపు వారి కుటుంబంతో ముచ్చ‌టించారు. అనంత‌రం నేల‌పై కూర్చొని భోజ‌నం చేశారు. ఈ విష‌యాన్ని సీఎం కేజ్రీవాల్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఆ కుటుంబం చూపించిన ప్రేమాభిమానాల‌కు ముగ్దుడిన‌య్యాన‌ని.. భోజనం చాలా బాగుంద‌ని చెప్పారు. ఇక దిలీప్ తివారీ కుటుంబాన్ని ఢిల్లీలోని త‌న ఇంటికి రావాల‌ని ఆహ్వానించిన‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ భోజ‌నం చేసిన ఫోటోల‌ను ఆమ్ఆద్మీ పార్టీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్‌గా మారాయి.

Next Story