'దేశం కోసం ప్రార్థన'.. రోజంతా కేజ్రీవాల్‌ ధ్యానం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్యాన ముద్రలోకి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏడు గంటల పాటు ధ్యానం ప్రారంభించారు.

By అంజి  Published on  8 March 2023 9:23 AM GMT
Arvind Kejriwal, meditation

ధ్యానం చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: హోళీ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్యాన ముద్రలోకి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏడు గంటల పాటు ధ్యానం ప్రారంభించారు. కేజ్రీవాల్ ధ్యానం చేస్తున్న చిత్రాలను ఆప్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ''ఈ రోజు కేజ్రీవాల్ జీ దేశం కోసం ప్రార్థిస్తున్నారు'' అని పేర్కొంది. తెల్ల‌టి దుస్తులు ధ‌రించిన కేజ్రీ .. ధ్యానం చేస్తూ క‌నిపించారు. ధ్యానం ప్రారంభించే ముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్‌ను సందర్శించి, అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. పార్టీ నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాల అరెస్టుల నేపథ్యంలో తాను ఈరోజు ధ్యానం చేస్తానని, హోలీని జరుపుకోబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటించారు. దేశ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అందుకే దేశం కోసం ప్రార్థిస్తున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి వీడియో సందేశంలో పేర్కొన్నారు. సిసోడియా, జైన్‌లు జైల్లో ఉన్నారని, అయితే అదానీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. ద‌ర్యాప్తు సంస్థులను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు

''ప్రజలకు మంచి విద్య, మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించే వారిని ప్రధానమంత్రి జైలులో పెట్టడం, దేశాన్ని దోచుకునే వారికి మద్దతు ఇవ్వడం ఆందోళన కలిగిస్తుంది. నేను దేశం కోసం ధ్యానం చేస్తాను, ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నది తప్పు అని భావిస్తే, మీరు కూడా దేశం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే.. హోళీ జరుపుకున్న తర్వాత దయచేసి దేశం కోసం ప్రార్థన చేయడానికి సమయం కేటాయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను'' అని కేజ్రీవాల్ అన్నారు. జైన్‌, సిసోడియాలు జైలులో ఉన్నారనే ఆందోళన తనకు లేదని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story