భారత్‌లో 40కిపైగా 'డెల్టా ప్లస్' వేరియంట్ కేసులు
Around 40 Cases Of Delta Plus "Variant Of Concern" Found In India.భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి తగ్గుముఖం
By తోట వంశీ కుమార్ Published on 23 Jun 2021 9:01 AM GMTభారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో డెల్టా ఫ్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు దేశంలో 40పైగా వెలుగు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రాష్ట్రాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రాలకే ఈ వేరియంట్ పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళ, తమిళనాడుల్లో మూడు, కర్ణాటకలో 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కొ కేసు నమోదు అయినట్లు కేంద్రం చెప్పింది. డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నా.. దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తేస్తుండటంతో ఈ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు డెల్టాఫ్లస్ రకాన్ని ఆందోళన కర రకం(వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో సంక్రమణ శక్తి పెరగడం, ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్(ఇన్సాకాగ్ ) వెల్లడించింది.
డెల్టా వేరియంట్‌లాగే ఇది కూడా చాలా వేగంగా వ్యాపించే వేరియంట్. ఇప్పటికే 9 దేశాలకు ఇది పాకినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో డెల్టా వేరియంట్ 80 దేశాలకు పాకిన విషయం తెలిసిందే. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టిస్తున్నాయని, ప్రస్తుత చికిత్సకూ అందడం లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలు..
సాధారణంగా కోవిడ్ సోకినవారిలో జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం, డయేరియా, తలనొప్పి, ఛాతినొప్పి, శ్వాసకోశ సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. డెల్టా వేరియంట్‌లో కోవిడ్ లక్షణాలతో పాటు కడుపునొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులు, వికారం, వినికిడి లోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డా.స్కాట్ గాట్లిబ్ దీనిపై స్పందిస్తూ.. వ్యాక్సిన్లు దీనిపై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందన్నారు. mRNA వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై 88శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్లు జాన్సన్ అండ్ జాన్సన్,అస్ట్రాజెనెకా 66శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందన్నారు.