పుట్‌బాల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. కుప్ప‌కూలిన గ్యాల‌రీ.. 200 మందికి గాయాలు.. వీడియో

Around 200 Injured After Gallery Collapses During Football Match in Malappuram.పుట్‌బాట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 1:39 PM IST
పుట్‌బాల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. కుప్ప‌కూలిన గ్యాల‌రీ.. 200 మందికి గాయాలు.. వీడియో

పుట్‌బాట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్యాల‌రీ కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో 200 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఐదుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలోని మ‌ల‌ప్పురం ప‌రిధిలోని పూన్‌గోడ్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మలప్పురంలోని పూన్‌గోడ్‌లో ఉన్న ఎల్పీ స్కూల్‌లో ఆల్‌ ఇండియా సెవన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ జ‌రుగుతోంది. శనివారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్ష‌కులు వ‌చ్చారు. ఏకంగా 8 వేల మంది హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. సామ‌ర్థ్యానికి మించి ఎక్కువ మంది రావ‌డంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాల‌రీ ఒక్క‌సారిగాకుప్ప‌కూలింది. మ్యాచ్ ప్రారంభ‌మైన కాసేప‌టికే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పై వ‌రుస‌లో కూర్చున్న వారంతా గాల్లోకి ఎగిరి గ్రౌండ్‌లో ప‌డిపోయారు. దాదాపు 200 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కాగా.. గ‌తేడాది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Next Story