కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు. బంగారం పూత పూసేందుకు ఆలయంలో ఉంచిన దాదాపు 12 పవన్లు (సుమారు 96 గ్రాములు) బంగారం కనిపించడం లేదని, దానిని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు నమోదైన ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. బంగారు పూత పూసే పని చివరిసారిగా రెండు రోజుల క్రితం జరిగిందని, ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్‌లో భద్రపరిచామని తెలిపారు. పని కోసం మళ్ళీ బంగారం బయటకు తీసినప్పుడు, దాదాపు 12 పవనాలు కనిపించలేదని, ఆ తర్వాత ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రముఖ దేవాలయానికి ఆరు నేలమాళిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంట. వాటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఎ, బి మాళిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు తెరిచారు. కొన్ని సంవత్సరాల కిందట దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కటం విశేషం.