ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గాలిలో ఉన్న ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

By Srikanth Gundamalla
Published on : 4 May 2024 7:00 PM IST

army helicopter, emergency landing,  maharashtra,

 ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ 

గాలిలో ఉన్న ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో.. వెంటనే స్పందించిన పైలట్ హెలికాప్టర్‌ను పొలాల్లోనే అవ్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్‌ ఏఎల్‌హెచ్‌ ధృవ్‌ (ALH Dhruv) లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో పైలట్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాలని చెప్పాడు. ఈ క్రమలోనే హెలికాప్టర్ ను సాంగ్లీ జిల్లాలోని ఎరండోలి గ్రామంలో పంట పొలంలో ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్‌ అకస్మాత్తుగా ల్యాండ్‌ కావడంతో స్థానిక ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని చూసేందుకు పొలం వద్దకు పరుగెత్తుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు సైనికులు సురక్షితంగా బయట పడ్డారని చెప్పారు అధికారులు. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ ఘటన శనివారం ఉదయం 11.30 గంటలకు జరిగింది.

కాగా.. ఈ హెలికాప్టర్‌ నాసిక్ నుండి బెలగావికి బయలుదేరింది. ఈ హెలికాప్టర్‌లో పైలట్, నలుగురు సైనికులు ఉన్నారు. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ గురించి సమాచారం అందుకున్న ఆర్మీ టెక్నీషియన్స్‌ అక్కడికి చేరుకున్నారు. కాసేపటికే హెలికాప్టర్‌లో ఉన్న లోపాన్ని తాత్కాలికంగా సరిదిద్దారు. లోపాన్ని సరి చేసిన తర్వాత హెలికాప్టర్‌ నాసిక్ మిలటరీ స్టేషన్‌కు చేరుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Next Story