తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్ ముందు వాదన సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వైద్యుడు బాబూ మనోహర్ సంచలన విషయాలను తెలియజేశారు. 2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చేదని తెలిపారు.
శశికళ తరఫు న్యాయవాది రాజా షణ్ముగం ప్రశ్నించగా డాక్టర్ ఈ వాంగ్మూలం ఇచ్చారు. జయలలితను మరింత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాను రోజుకు 16 గంటలు పని చేస్తున్నందున కష్టమని జయలలిత బదులిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న గుండెపోటుతో మరణించారు. అధికారంలో ఉండగా మరణించిన భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె నిలిచిపోయారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ ఏ ఆరుముగస్వామి నేతృత్వంలో కమిషన్‌ను నియమించింది. ఆమె 75 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరణానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు వైద్యులతో కూడిన ప్యానెల్‌ను నామినేట్ చేయాలని, విచారణకు నాయకత్వం వహిస్తున్న జస్టిస్ ఎ ఆరుముగస్వామి కమిషన్‌కు సహాయం చేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
బహిష్కరించబడిన అన్నాడీఎంకే సభ్యుడు టీటీవీ దినకరన్ ఈ అంశంపై స్పందిస్తూ, జయలలిత అనారోగ్యంతో ఉన్నారని, ఆ తర్వాత తన అత్త వి శశికళను లక్ష్యంగా చేసుకుని ఆమె మరణాన్ని రాజకీయం చేశారని విమర్శించారు.