పబ్లిసిటీ కోసం అన్నాడీఎంకే కొత్త యాడ్.. చివరికి ఏం జరిగిందంటే ..

Minister K Pandiarajan posted a video on Twitter. మంత్రి పాండియరాజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి దారి తీసింది

By Medi Samrat  Published on  5 April 2021 8:44 AM IST
K Pandiarajan

మంత్రి పాండియరాజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి దారి తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా బలవన్మరణానికి పాల్పడిన అనిత అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మిమిక్రీ చేసి ఆ వీడియోలో పెట్టడం వివాదానికి కారణం. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండి పడుతుండటంతో ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మంత్రి మరో వీడియో చేయాల్సి వచ్చింది.

మెరిట్‌ మార్కులు దక్కినా, నీట్‌ రూపంలో వైద్య సీటు దూరం కావడంతో రాష్ట్రంలో బలన్మరణానికి పాల్పడిన విద్యార్థి అనిత. ఆమె మరణంతో నీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే సాగాయి. తాజా ఎన్నికల్లో నీట్‌కు వ్యతిరేకంగా ప్రతి పక్షాలు వ్యాఖ్యలు చేసే సమయంలో తప్పనిసరిగా అనిత పేరును స్మరించుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గొంతుతో ఓట్లను దండుకునేందుకు చేసిన ఓ ప్రయత్నం అన్నాడీఎంకే ఆవడి అభ్యర్థి, మంత్రి పాండియరాజన్‌కు బెడిసికొట్టింది.

అనిత నీట్‌కు వ్యతిరేకంగా గతంలో తీవ్రంగానే వ్యాఖ్యలు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ,అన్నాడీఎంకేకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా మిమిక్రీ చేసి ఓ వీడియోను సిద్ధం చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. దీంతో మేల్కొన్న మంత్రి పాండియరాజన్‌ తన వ్యాఖ్యలతో ఓ వీడియో విడుదల చేశారు. తనకు తెలియకుండా ఈ యాడ్ ను పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశానని అన్నారు.

అయితే, అనిత సోదరుడు మణిరత్నం ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించాడు. తన చెల్లెల్ని నీట్‌రూపంలో పొట్టన పెట్టుకుంది కాకుండా, ఇప్పుడు ఆమె గొంతును మిమిక్రీ చేసి ఓట్లు దండుకునే యత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ వీడియో అనితను కించ పరిచనట్టుగానే ఉందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.



Next Story