'దేవుడు చెప్పాడు.. మధ్యాహ్నం చనిపోతున్నా'.. వృద్ధురాలు హంగామా

An elderly woman in Rajasthan created a ruckus after claiming she was dying. రాజస్థాన్‌లో 90 ఏళ్ల ఓ వృద్ధురాలు.. తాను చనిపోతున్నానంటూ నానా హంగామా సృష్టించింది. దేవుడు తనకు కలలో కనిపించి ఆదివారం

By అంజి  Published on  11 Oct 2022 5:04 AM GMT
దేవుడు చెప్పాడు.. మధ్యాహ్నం చనిపోతున్నా.. వృద్ధురాలు హంగామా

రాజస్థాన్‌లో 90 ఏళ్ల ఓ వృద్ధురాలు.. తాను చనిపోతున్నానంటూ నానా హంగామా సృష్టించింది. దేవుడు తనకు కలలో కనిపించి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు చనిపోబోతున్నట్లు చెప్పాడని అందరికీ చెప్పింది. ఈ వింత ఉదంతం అల్వార్‌ జిల్లాలోని ఖేడ్లీలో జరిగింది. ఖేడ్లీ పట్టణంలోని సౌంఖర్‌ రోడ్‌లో నివసిస్తున్న ఓ వృద్ధురాలు చిరోంజి దేవ్‌ తాను చనిపోతున్నానని ఇంటి బయట సమాధిలోకి వెళ్లిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి తెలిపింది. ఈ సమాచారం ఆ ప్రాంతమంతా దావనంలా వ్యాపించింది. ఆ వృద్ధ మహిళను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు గుమిగూడారు.

అక్కడ కొంతమంది స్త్రీలు విషాద గీతాలు పాడటం ప్రారంభించారు. చనిపోయేవారికి చివరిసారిగా చేసే కార్యక్రమాలన్నీ చేశారు. కొందరు మహిళలు చీరలు, కొంత డబ్బు అందించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ కార్యక్రమం చాలా గంటలపాటు ఇలాగే సాగింది. ఈ మొత్తం విషయాన్ని కొందరు పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను రిఫరల్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉంది, దీనిపై కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగానో ఒప్పించినా ఆమె వినలేదు. వృద్ధ మహిళకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు రామ్ సైనీ మాట్లాడుతూ.. ఆమెకు నెల రోజులుగా నిద్ర పట్టడం లేదని, ఆమె మరణించిన రోజును నిర్ణయించడానికి దేవుడితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వృద్ధురాలు ఖేడ్లీ పట్టణంలోని ఆసుపత్రిలో చేరింది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా ఏమీ చెప్పేందుకు అధికార యంత్రాంగం నిరాకరించింది. ఈ మొత్తం ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Next Story