తక్కువ ధరకే బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్
Amphotericin B injection RS 1200.దేశంలో కరోనా మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 11:51 AM ISTదేశంలో కరోనా మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు కాటేస్తోంది. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఇక ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఇంజెక్షన్ తయారీ నిమిత్తం జెనెటిక్ లైఫ్సైన్సెస్కు ఎఫ్‌డీఏ(అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతి లభించింది.
ఎఫ్‌డీఏ అనుమతి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కంపెనీ వార్దా ప్లాంట్ల్లో వచ్చే 15 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.7000గా ఉండడం, దీనితో పాటు దేశీయంగా తీవ్ర కొరత నెలకొంది. జెనెటిక్ లైఫ్‌సైన్సెస్ మాత్రం ఈ ఇంజెక్షన్‌ను కూ.1200 కే అందించనుంది. రోజుకు ఈ ప్లాంట్‌లో 20 వేల ఇంజెక్షన్లు తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ సంస్థ కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లనూ తయారు చేస్తోంది.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు..
నాసో ఆర్బిటల్ మెనింగ్ మ్యుకర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్రల్ మ్యుకర్ మైకోసిస్‌గా పిలిచే ఈ ఫంగస్ వల్ల ఇది ఉత్పన్నమై ప్రాణాపాయం వరకూ తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మెదడుకు చేరుకుని అవయవాలను పాడు చేస్తోంది. నియంత్రణలో లేని మధుమేహ రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకుతుందని నిపుణులు తేల్చారు. దీంతోపాటు సైనసైటిస్ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌పై ఆందోళన వద్దని వారు సూచించారు.
* కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం,
*జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. *నాలికపై నల్లటి మచ్చలు ఉంటే.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. ఈ వ్యాధి సోకితే.. 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ ఎముకలను కూడా తినేయగలదు. ఇది తిన్నగా బ్రెయిన్‌ను దెబ్బతీసి రోగిని చంపేయగలదు.