అమిత్ షాకు పిచ్చి పట్టింది, రాజకీయాలు మానుకోవాలి: లాలూ యాదవ్
అమిత్ షాకు పిచ్చి పట్టిందని, ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజీనామా చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అన్నారు.
By అంజి Published on 19 Dec 2024 5:22 AM GMTఅమిత్ షాకు పిచ్చి పట్టింది, రాజకీయాలు మానుకోవాలి: లాలూ యాదవ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో, అమిత్ షాకు పిచ్చి పట్టిందని, ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజీనామా చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ చర్చకు కేంద్ర హోంమంత్రి సమాధానమిస్తూ.. ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనడం కొందరికి ఫ్యాషన్ అయిందంటూ నిన్న రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే లాలూ యాదవ్ మాట్లాడుతూ.. ''అమిత్ షాకు పిచ్చి పట్టింది. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై ఆయనకు ద్వేషం ఉంది. ఆయనకు ఉన్న ఈ పిచ్చిని ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు. అమిత్ షా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్లిపోవాలి'' అని లాలూ యాదవ్ అన్నట్టు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. అమిత్ షా, బిజెపి "రాజ్యాంగానికి వ్యతిరేకం", ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు.
"బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఫ్యాషన్, అభిరుచి. అతను మా ప్రేరణ కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడానికి మేము ఎవరినీ అనుమతించము. ఈ వ్యక్తులు విద్వేషాన్ని వ్యాప్తి చేసే రాజ్యాంగ వ్యతిరేకులు, పార్లమెంటులో ఉపయోగించిన భాష ఖండించదగినది" అని యాదవ్ ఏఎన్‌ఐకి చెప్పారు.
కాగా, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. "అతను (HM అమిత్ షా) పార్లమెంటు లోపల బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించారు. అందుకే, ఆయన క్షమాపణలు, మంత్రివర్గం నుండి రాజీనామా కోసం మేము ఈ రోజు వాయిదా తీర్మానం ఇచ్చాము" అని ఆయన అన్నారు.