అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల గుట్టు విప్పనున్న మెర్సిడెజ్ బెంజ్ కారు..!
Ambani Bomb Scare: Key Recoveries From A Mercedes. సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకోగా.. అందులో కీలక ఆధారాలు దొరికాయి.
By Medi Samrat Published on 17 March 2021 8:59 AM GMTఫిబ్రవరి 25న ముంబైలోని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే..! తన స్కార్పియో కనిపించడం లేదంటూ థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్ శవమై తేలాడు. హిరేన్ భార్య విమల సచిన్‌వాజేపై ఫిర్యాదు చేసింది. దీంతో మన్సుఖ్ హిరేన్ అనుమాన్సాద మరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను సేకరిస్తోంది.
ముఖ్యంగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ , ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్‌వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకోగా.. అందులో కీలక ఆధారాలు దొరికాయి. 5 లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను సీజ్ చేసింది. వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న బెంజ్‌కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం లైసెన్స్ ప్లేట్‌ను కూడా ఉండడంతో కేసు కీలక మలుపు తీసుకుంది.
సచిన్‌వాజేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్‌టాప్‌లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
సీసీటీవీలో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది. చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్‌తోనే పీపీఈ కిట్ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్ కారు అసలు యజమాని ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు కూడా దొరికితే కేసును సాల్వ్ చేయడం అధికారులకు పెద్ద కష్టం కాదు.