అమావాస్య రోజే ఎక్కువ నేరాలు..అలెర్ట్‌గా ఉండాలి: యూపీ డీజీపీ

అమావాస్య రోజున నేరగాళ్లు చురుగ్గా ఉంటున్నారని ఉత్తర్‌ ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 6:58 AM GMT
Amavasya Day, More Crime, Uttar Pradesh, DGP,

అమావాస్య రోజే ఎక్కువ నేరాలు..అలెర్ట్‌గా ఉండాలి: యూపీ డీజీపీ

నేరాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో ఎవరికీ తెలియదు.. కొందరు ప్లాన్‌ చేసి మర్డర్లు చేస్తుంటారు. ఇంకొందరు క్షణికావేశంలో చేస్తారు. దొంగలు అయితే.. ఎవరూ లేని సమయాల్లో అర్ధరాత్రులు చోరీలకు పాల్పడుతుంటారు. అయితే.. ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌ డీజీపీకి జారీ చేసిన ఓ సర్క్యులర్‌ విచిత్రంగా ఉంది. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మామూలుగానే ఉన్నతాధికారులు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు చేస్తారు. నేరాలు జరిగే చోట్లను గుర్తించి.. అక్కడ భద్రత పెంచాలని చెబుతుంటారు. కానీ..ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ మాత్రం భిన్నంగా ఉన్నారు. హిందూ క్యాలెండర్‌ ప్రకారం అమావాస్య రోజున పోలీసులు మరింత అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఈ సర్క్యులర్‌ జారీ చేసినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్నల్‌ సర్క్యులర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అమావాస్య రోజున నేరగాళ్లు చురుగ్గా ఉంటున్నారని.. చాలా వరకు ముఠాలు కూడా అదే రోజున దోపిడీలకు పాల్పడుతున్నారని ఉత్తర్‌ ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌కు డీజీపీ పంచాంగం కాపీని కూడా జత చేశారు. అమవాస్య ఏఏ తేదీల్లో వస్తుందో చూసుకుని.. నేరాలు జరిగే ప్రాంతాల్లో ఆ రోజున మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాలను తగ్గించేందుకే తాము ఈ తరహా భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ఆగస్టు 16, సెప్టెంబర్ 14, అక్టోబర్‌ 14న అమావాస్య వస్తోందని.. ఈ రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇక అమావాస్యకు ఒక వారం ముందు.. ఆ తర్వాత వారం రోజులు కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ చెప్పారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు జరుగుతున్న తేదీలను పరిశీలించాకే ఈ నిర్ణయానికి వచ్చామని అయన తెలిపారు. పోలీసులే కాదు.. ప్రజలు కూడా అమావాస్య రోజుల్లో బయటకు రావొద్దని.. అలర్ట్‌గా ఉండాలని చెప్పారు.

Next Story