అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇక అంతా దేవుడి దయ
Allahabad high court concern about rural up healthcare system. గ్రామీణ ప్రాంతాలు కరోనాతో అల్లాడుతున్న క్రమంలో విషాదకర పరిస్థిలపై యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 18 May 2021 2:26 PM IST
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తొలి వేవ్‌లో ఎక్కువగా నగరాల్లోనే కేసులు, మరణాలు సంభవించగా.. రెండో వేవ్‌లో చిన్నపాటి గ్రామాలను కూడా వదలడం లేదు. చాలా గ్రామాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక మృత్యువాత పడుతున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాలు కరోనాతో అల్లాడుతున్న క్రమంలో మరణాలు భారీగా నమోదవుతున్న విషాదకర పరిస్థిలపై యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అలహాబాద్ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. విచారణలో భాగంగా ఇక అంతా దేవుడి దయ అంటూ వ్యాఖ్యానించింది. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ సిద్ధార్ధ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలను కూడా రాముడే కాపాడాలని వ్యాఖ్యానించింది.
గత నెల కరోనా బారినపడ్డ ఓ వ్యక్తి చికిత్స కోసం మీరట్ హాస్పిటల్‌లో చేరగా.. అతడు కనిపించకుండా పోవడంపై ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ కుమార్ అనే బాధితుడు టాయ్‌లెట్‌లో కుప్పకూలిపోయాడు. తర్వాత అతడిని స్ట్రెచర్‌పై వేసి సపర్యలు చేసినా అప్పటికే అతడు చనిపోయాడు. అయితే.. తర్వాత అతడిని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాంగా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది పారేశారు. ఇది రాత్రి షిఫ్ట్‌లో ఉన్న వైద్యుల అజాగ్రత్త, నిర్లక్ష్యానికి పరాకాష్ట అని న్యాయస్థానం మండిపడింది.
సాధారణ రోజుల్లోనే ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించే పరిస్థితులు లేవనీ..అటువంటి దుస్థితిలో ఇక ఇలాంటి ఈ కరోనా మహమ్మారి సమయంలో చెప్పేపరిస్థితి లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వైద్య వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు సరిపడా ఆసుపత్రులు కూడా లేవని తీవ్రంగా ప్రభుత్వమీద మండిపడింది. ఒక హెల్త్ సెంటర్ లో దాదాపు 3 లక్షల ప్రజల లోడ్ ఉంటే.. అక్కడ కేవలం 30 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తోందని తీవ్రంగా ప్రశ్నించింది. అంటే ఒక్కో సీహెచ్‌సీలో కేవలం 0.01 శాతం మంది ప్రజలకు మాత్రమే సేవలందించగుతోందంటూ దుయ్యబట్టింది.
ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో 16.28లక్షల మందికి కరోనా సోకగా.. 17,871 మరణాలు సంభవించాయి. కాగా.. వైద్య సౌకర్యాల కొరతపై విమర్శలు వస్తున్నప్పటికి.. అలాంటి ఏమీ లేదంటూ అక్కడి ప్రభుత్వం చెబుతోంది.