పోలీసుల గడ్డంపై కోర్టు కీలక వ్యాఖ్యలు..!
Allahabad HC declines to allow police personnel to maintain beard.పోలీసుల గడ్డంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2021 11:18 AM GMTపోలీసుల గడ్డంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు గడ్డం ఉంచుకోవడం అనేది రాజ్యాంగపరమైన హక్కు కాదని స్పష్టం చేసింది. యూపీ పోలీసుల్లో గడ్డంపై నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పిటిషన్ దాఖలు చేసిన కానిస్టేబుల్ పై దాఖలు చేసిన సస్పెన్షన్ ఆర్డర్ మరియు ఛార్జ్‌షీట్ లో జోక్యం చేసుకోవడానికి కూడా కోర్టు నిరాకరించింది. అయోధ్య జిల్లాలోని ఖండాసా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహ్మద్ ఫార్మాన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి పిటిషన్ లో, కానిస్టేబుల్ తనపై సస్పెన్షన్ ఉత్తర్వును అయోధ్య డిఐజి/ఎస్‌ఎస్‌పి జారీ చేసారని పేర్కొన్నారు. రెండవ పిటిషన్‌లో, డిపార్ట్‌మెంటల్ క్రమశిక్షణ ప్రక్రియలో భాగంగా ఛార్జి షీట్ దాఖలు చేసారని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కు కింద తాను ముస్లిం సూత్రాల ఆధారంగా గడ్డం ధరించాను అని కానిస్టేబుల్ వాదించాడు. ఈ పిటిషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు యూపీ పోలీసుల్లో గడ్డంపై నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. సస్పెన్షన్ ఆర్డర్ మరియు ఛార్జ్‌షీట్ లో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.