రైల్వే సేవలన్నీ ఒకే యాప్‌లో.. సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలంటే?

గతంలో రైల్వేకు సంబంధించి ఒక్కో సేవకు ఒక్కో యాప్‌ ఉండేది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోటుకు చేర్చి 'రైల్‌వన్‌' పేరిట సూపర్‌ యాప్‌ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

By అంజి
Published on : 7 July 2025 10:26 AM IST

railway services, railway, railone app, IRCTC, UTS

రైల్వే సేవలన్నీ ఒకే యాప్‌లో.. సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలంటే?

గతంలో రైల్వేకు సంబంధించి ఒక్కో సేవకు ఒక్కో యాప్‌ ఉండేది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోటుకు చేర్చి 'రైల్‌వన్‌' పేరిట సూపర్‌ యాప్‌ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్‌లో రిజర్వ్‌డ్‌/ అన్‌రిజర్వ్‌డ్‌.. ప్లాట్‌ఫామ్‌ టికెట్లతో పాటు రైల్వే ఎంక్వైరీ, ఫుడ్‌ సేవలు కూడా ఒకే చోట పొందవచ్చు. మరి ఈ సర్వీసులు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు యాప్‌ స్టోర్‌ నుంచి 'రైల్‌ వన్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అవసరమైన పర్మిషన్లు ఇచ్చాక.. యాప్‌ ఓపెన్‌ అవుతుంది. మీరు ఇందులో ఏం బుక్‌ చేయాలన్నా మీకంటూ ఒక అకౌంట్‌ ఉండాల్సిందే. కాబట్టి మీ ఐఆర్‌సీటీసీ/ రైల్‌ కనెక్ట్‌/ యూటీఎస్‌ ఖాతా డీటేయిల్స్‌తోనే ఇందులో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఈమెయిల్‌కు వచ్చిన ఓటీపీతో మీ లాగిన్‌ పూర్తవుతుంది. అనంతరం ఈ యాప్‌ సేవలను వినియోగించుకోవచ్చు.

యూటీఎస్‌ ఖాతా లేకపోయినా.. ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు

మీకు గతంలో రైల్‌ కనెక్ట్‌ లేదా యూటీఎస్‌ ఖాతా లేకపోయినా.. రైల్‌వన్‌ యాప్‌ ద్వారా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఈ యాప్‌లో కొత్తగా రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. యాప్‌ ఇంటర్‌ ఫేస్‌లో కనిపించే 'న్యూ రిజిస్ట్రేషన్‌'పై క్లిక్‌ చేసి ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ అయ్యి ట్రైన్‌ బుక్‌ చేసుకోవచ్చు. మీ పూర్తి పేరు, మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సైనప్‌ అవ్వాలి. ఓటీపీ, ఎంపీన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఫింగర్‌ ప్రింట్‌ లాగిన్‌ను కూడా ఆన్‌ చేసుకోవచ్చు.

అకౌంట్‌ వద్దనుకుంటే..

మీకు ఒకవేళ ఖాతా తెరవడం ఇష్టం లేకపోతే.. గెస్ట్‌గా లాగిన్‌ అవ్వొచ్చు. కానీ, ఇలా టికెట్లు బుక్‌ చేయలేరు. అలాగే.. ఫుడ్‌ ఆర్డర్‌ కూడా చేయలేరు. కానీ రైలు సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రాకింగ్‌, ప్లాట్‌ఫామ్‌ సమాచారం వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలరు.

Next Story