15 ఏళ్లు దాటిన ప్ర‌భుత్వ వాహ‌నాలు 'తుక్కు' కిందే లెక్క.. ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి

All govt vehicles older than 15 yrs to be scrapped.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 15 ఏళ్లు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 20 Jan 2023 9:09 AM IST

15 ఏళ్లు దాటిన ప్ర‌భుత్వ వాహ‌నాలు తుక్కు కిందే లెక్క.. ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 15 ఏళ్లు దాటిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన వాహ‌నాల‌ను అన్నింటిని ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద ప‌రిగ‌ణించ‌నున్నారు. వాటి రిజిస్ట్రేష‌న్లు కూడా ర‌ద్దు చేయ‌బ‌డ‌తాయ‌ని ఆ నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన బ‌స్సుల‌కూ ఈ నిబంధ‌న వ‌ర్తించ‌నుంది. అయితే.. దేశ ర‌క్ష‌ణ‌, శాంతి భ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త నిర్వ‌హ‌ణ కోసం వినియోగించే వాహ‌నాల‌కు దీన్ని నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.

ప్రాథ‌మిక రిజిస్ట్రేష‌న్ న‌మోదై 15 ఏళ్లు పూర్తి అయిన వాహ‌నాల‌ను వ‌దిలించుకోవాల్సి ఉంటుంది. వాటిని నిబంధ‌న‌ల ప్ర‌కారం వాహ‌న తుక్కు ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌ర‌లించాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్ 2021-22లో ప్రకటించిన విధానం ప్ర‌కారం వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏళ్లు, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏళ్ల త‌రువాత ఫిట్‌నెస్ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి .

ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చిన విధానం ప్రకారం.. పాత వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చిన త‌రువాత వాటి య‌జ‌మానులు కొనుగోలు చేసే కొత్త వాహ‌నాల‌కు రహదారి పన్నుపై 25 శాతం వరకు పన్ను రాయితీని అందించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

గ‌త సంవ‌త్స‌రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రతి సిటీ సెంటర్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో కనీసం ఒక ఆటోమొబైల్ స్క్రాపింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశం మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మారే అవకాశం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు.

Next Story