ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మనం కోరుకున్నది నిమిషాల వ్యవధిలోనే మన ఇంటి ముందు ఉంటుంది. అలాగే మద్యాన్ని కూడా 10 నిమిషాల్లో హోం డెలివరీ చేస్తామని హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇన్నొవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'బూజీ' బ్రాండ్ పేరుతో ఈ సర్వీసును ప్రారంభించింది. అయితే.. ఇది మన దగ్గర కాదులెండి కోల్‌కతాలో.
ఇప్పటికే పలు సంస్థలు మద్యం డోర్ డెలివరీని అందిస్తున్నాయి. అయితే.. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే లిక్కర్ డెలివరీ అందిస్తున్న సంస్థ తమదేనని ఇన్నొవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న తరువాత కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పని చేస్తామని సంస్థ సీఈవో వివేకానంద చెప్పారు.
కాగా.. ఆన్‌లైన్‌లో మద్యం అర్డర్ ఇచ్చేందుకు వినియోగదారులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేసి వయస్సు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక ఒక వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపై బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.