ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 4:46 PM IST
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. దాంతో.. తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి అఖిలేష్ యాదవ్ బుధవారం రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ కూడా ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన పత్రాలను శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబె కార్యాలయానికి పంపించారు.
కాగా.. అఖిలేష్ యాదవ్ 2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన కొనసాగారు. తాజాగా అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే.. పార్టీకి మేలు జరిగేలా, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచేలా నిర్ణయం ఉంటుందని వారు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ సత్తా చాటింది. బీజేపీకి గత రెండు ఎన్నికల్లో కంచుకోటగా ఉన్న యూపీని అఖిలేష్ బద్దలు కొట్టారు. మొత్తం 80 ఎంపీ సట్లు ఉంటే.. ఎస్‌పీ ఏకంగా 37 కైవసం చేసుకుంది. బీజేపీ 33, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ 2 స్థానాలు, ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నా దళ్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. మరోవైపు హిందూత్వ ప్రచారం చేసుకునే బీజేపీ.. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో కూడా ఓడిపోయింది. దాంతో.. ఆ పార్టీకి యూపీలో ఆదరణ తగ్గినట్లు అయ్యింది. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎస్‌పీ అభ్యర్థి అవదేశ్ విజయం సాధించారు.