గాల్లోకెగిరిన ఆకాశ ఎయిర్‌ తొలి విమానం

Akasa Air’s first flight takes off on Mumbai-Ahmedabad route. భారత విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్‌ ట్రేడర్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన

By అంజి
Published on : 7 Aug 2022 2:25 PM IST

గాల్లోకెగిరిన ఆకాశ ఎయిర్‌ తొలి విమానం

భారత విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్‌ ట్రేడర్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌ సంస్థ తన కార్యకలాపాలను నేడు ప్రారంభించింది. ముంబై - అహ్మదాబాద్‌ రూట్‌లో కమర్షియల్‌ ఫ్లైట్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఆకాశ ఎయిర్‌కు చెందిన ఫస్ట్‌ ఎయిర్‌ సర్వీస్‌ను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకాశ ఎయిర్‌ సంస్థకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య విషెస్‌ చెప్పారు. ఆకాశ ఎయిర్‌ సురక్షితంగా, అత్యంత ఎత్తుకు ఎదగాలని, ఆకాశాన్ని ఏలాలని ఆకాంక్షించారు.

ఈ ఎయిర్‌ సంస్థ తక్కువ ధరలోనే విమానయాన సేవలు అందించనుంది. నేటి నుంచి ముంబై - అహ్మదాబాద్‌ మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నగరాల మధ్య 28 వీక్లీ విమాన సర్వీసులు నడుస్తాయని ఆకాశ ఎయిర్‌ తెలిపింది. ఈ నెల 13 నుంచి బెంగళూరు - కొచ్చి మధ్య 28 వీక్లీ విమాన సర్వీసులను ప్రారంభించింది. వీటికి సంబంధించి టికెట్ల బుకింగ్‌ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. తక్కువ ధరకు టికెట్లు లభిస్తుండటంతో విమాన ప్రయాణికులు ఆకాశ ఎయిర్‌ టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

షెడ్యూల్‌లో భాగంగా అకాశ ఎయిర్ ముంబై- అహ్మదాబాద్ ప్రతి రోజూ విమానం ఉదయం 10.05 గంటలకు ముంబై నుంచి బయల్దేరుతుంది. బుధవారం మినహా ప్రతి రోజు ఈ రూట్‌లో విమానం నడుస్తుంది. అహ్మదాబాద్ నుంచి రిటర్న్ విమానం మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై నుంచి విమాన టికెట్ల ధర రూ. 4,314 నుంచి ప్రారంభం కాగా, అహ్మదాబాద్ నుంచి వచ్చేవారికి టికెట్ ప్రారంభ ధర రూ. 3,906గా ఉంది.

జూలై 7న అకాసా ఎయిర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను పొందింది. సెప్టెంబర్ 15, 2022 నుండి చెన్నై - ముంబై మధ్య విమానాలను ప్రారంభించనుంది.

Next Story