టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే విమానంలో మంటలు.. చివరకు..

టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే విమానం ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 11:37 AM IST
air india flight, fire,   bangalore airport,

టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే విమానంలో మంటలు.. చివరకు..

టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే విమానం ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. దాంతో.. వెంటనే గమనించిన పైలట్లు అప్రమత్తం అయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సేఫ్‌గా విమానం ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 179 ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం ఎయిరిండియాకు చెందిన విమానంలో చోటుచేసుకుంది.

శనివారం రాత్రి 11.12 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా IX 1132 విమానం కొచ్చికి బయల్దేరింది. టేకాఫ్‌ అంతా సరిగ్గానే జరిగింది. ఇక గాల్లోకి పూర్తిగా వెళ్లాక.. కాసేపటికే కలకలం రేపింది. ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్నట్లు పైలట్లు గుర్తించారు. ఇక మంటలు చెలరేగుతున్న దృశ్యాలు కిటికీలో నుంచి ప్రయాణికులకు కూడా కనిపించింది. అంతే.. ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఇక అప్రమత్తం అయిన పైలట్లు వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవసరమని చెప్పారు. దాంతో.. వారు కూడా విమానం ల్యాండ్‌ అయ్యేందుకు రూట్ క్లియర్ చేశారు.

విమానాన్ని సేఫ్‌గా పైలట్లు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఇక విమానం కిందకు దిగడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై సిద్ధంగా ఉంచారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఇక ప్రయాణికులను వెంటనే విమానం నుంచి కిందకు సేఫ్‌గా దించేశారు. దాంతో.. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మంటలను అదుపు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎయిరిండియా పేర్కొంది. ఇక ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామనీ.. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్టన్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.


Next Story