ఎయిరిండియా విమానం 20 గంటలు ఆలస్యం.. స్పృహ కోల్పోయిన ప్రయాణికులు

తాజాగా ఎయిరిండియా విమానం కూడా ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 6:18 AM GMT
air india, flight, passengers ,

 ఎయిరిండియా విమానం 20 గంటలు ఆలస్యం.. స్పృహ కోల్పోయిన ప్రయాణికులు

విమాన ప్రయాణం చాలా వేగంగా సాగుతుంది. వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కొద్ది గంటల్లోనే చేయవచ్చు. చాలా మంది ప్రముఖులు విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే.. కొన్నిసార్లు విమానాలు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని సార్లు సాంకేతిక లోపం కారణమైతే.. ఇంకొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పులే కారణం అవుతాయి. ఇక తాజాగా ఎయిరిండియా విమానం కూడా ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. విమానంలో కూర్చొనిపోయారు. దాదాపు 20 గంటలపాటు విమానం ఆలస్యంగా టేకాఫ్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు స్పృహ కోల్పోయినట్లు వారు పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ సంఘటన జరిగింది. ఎయిరిండియా సంస్థకు చెందిన ఏఐ 183 విమానం గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరాల్సి ఉంది. కానీ.. ఆ విమానంలో సాంకేతిక సమస్య, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. కాగా.. అప్పటికే ఆ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులంతా బోర్డింగ్ పూర్తి చేసుకుని లోపలికి వచ్చారు. ఇక విమానం టేకాఫ్ ఆలస్యం అవుతుందని తెలుసుకున్న వారు బయటకు వెళ్లాలని ప్రయత్నించినా.. ఎయిర్‌పోర్టు సిబ్బంది అందుకు అనుమతి ఉండదని అడ్డుకున్నారు. దాంతో.. చేసేందేం లేక ప్రయాణికులు కొందరు విమానంలో కూర్చున్నారు.

ప్రయాణికులు విమానంలోకి ఎక్కితే అక్కడా మరో సమస్య ఎదురుపడింది. విమానంలో ఏసీ పనిచేయడం లేదని సిబ్బంది చెప్పారు. అప్పటికే సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. కానీ వారు ఏం చేయలేని స్థితిలో ఉండం చూసి కామ్‌గా కూర్చున్నారు. దాదాపు 8 గంటల పాటు విమానంలో ఏసీ లేకుండానే ఉండిపోయారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు స్పృహ కోల్పోయినట్లు విమానంలో ఉన్న ప్రయాణికులు చెప్పారు. తమకు ఎదురైన అసౌకర్యాన్ని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వారి పోస్టులతో స్పందించిన ఎయిరిండియా యాజమాన్యం.. అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని పేర్కొంది. ఇక ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

ఆ తర్వాత శుక్రవారం ఉదయం 11 గంటలకు విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి శ్రాన్‌ఫ్రాన్సిస్కోకి బయల్దేరిందని ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. అంటే దాదాపు 20 గంటల పాటు ఆ విమానం లో వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు.

Next Story