భారతదేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎక్కడ థర్డ్ వేవ్ వస్తుందా అని అందరూ భయపడుతూ ఉన్నారు. ఇక రాబోయే నెలల్లో కరోనా కేసులు కాస్త పెరిగినా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రజలు కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు టీకాలు వేసుకుంటున్నారని.. వైరస్ సోకినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదన్నారు. ప్రజలు కొవిడ్ నియమాలను ఎంత మేరకు ఖచ్చితంగా పాటిస్తారనే విషయంపైనే కొవిడ్ ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు.
టీకాలు వేయకపోవడంతో చాలా మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని అన్నారు. అయినా పిల్లలు కరోనా బారినపడినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండదని ప్రపంచ డేటా చూపిస్తోందన్నారు. దేశంలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో 55-60 శాతం మంది పిల్లల్లో ఇప్పటికే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారన్నారు. వైరస్ సానుకూలత రేటు తక్కువ ఉన్న ప్రాంతాలు, కొవిడ్ నిబంధనలు అనుసరిస్తున్న ప్రాంతాల్లో తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని అన్నారు. కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైతే వెంటనే పాఠశాలలను మూసివేయాలన్నారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడంతో 'రిస్క్-బెనిఫిట్‌అనాలిసిస్'పై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందన్నారు.