ఏఐఎడిఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి విజయలక్ష్మీ కన్నుమూశారు. ఆమె వయస్సు 63 సంవత్సరాలు. ఉదర వ్యాధి కారణంగా గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ రోజు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉండగా.. ఉదయం తీవ్రమైన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. పన్నీరుసెల్వం స్వంత పట్టణం పెరియాకులమ్‌లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.కాగా.. విజయలక్ష్మీకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. థేనీ పార్లమెంట్ సభ్యులు పీ రవీంద్రనాథ్ అందులో ఒకరు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి దురై మురుగన్, తంగం తెన్నరాజు, పికె శేఖర్ బాబు, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి, అన్నాడీఎంకే సీనియర్ కార్యకర్తలు విజయలక్ష్మి భౌతిక కాయానికి ఆసుపత్రిలో నివాళులర్పించారు. విజయలక్ష్మి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం ఎంకే స్టాలిన్ పన్నీరుసెల్వంను కలిసి ఓదార్చారు.