దొంగతనం చేస్తే 'AI' పట్టేస్తుంది.. బెంగళూరు టెక్కీ వినూత్న ప్రయోగం వైరల్!

సాంకేతిక నగరం బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదును పెట్టి, ఏకంగా తన వంట మనిషి చేస్తున్న చిన్న చిన్న దొంగతనాలకు చెక్ పెట్టాడు.

By -  అంజి
Published on : 2 March 2026 1:19 PM IST

Bengaluru Techie, AI Roommate, Smart Kitchen Monitoring, Catching Theft with AI, Innovative Home Gadgets, AI Surveillance, Home Automation India

దొంగతనం చేస్తే 'AI' పట్టేస్తుంది.. బెంగళూరు టెక్కీ వినూత్న ప్రయోగం వైరల్!

సాంకేతిక నగరం బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదును పెట్టి, ఏకంగా తన వంట మనిషి చేస్తున్న చిన్న చిన్న దొంగతనాలకు చెక్ పెట్టాడు. పంకజ్ అనే ఈ టెక్కీ, తను సొంతంగా తయారు చేసిన "AI రూమ్‌మేట్" అనే మానిటరింగ్ సిస్టమ్ సహాయంతో వంట మనిషి ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పంకజ్ తన వంటగదిలో ఒక కెమెరాను అమర్చి, దానికి AI పవర్ ఇచ్చాడు. ఈ సిస్టమ్ వంటగదిలో జరిగే ప్రతి కదలికను పర్యవేక్షిస్తుంది. వంట మనిషి.. యజమానికి తెలియకుండా ఏదైనా వస్తువు తీసుకుంటే, వెంటనే పంకజ్ ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. వారానికి ఒకసారి వంటగదిలో జరిగిన పరిణామాలపై ఈ AI ఒక సమగ్ర నివేదికను పంపిస్తుంది. ఆమె వంట చేసే ముందు చేతులు కడుక్కుందా? వంట పూర్తయ్యాక ప్లాట్‌ఫారమ్‌ను శుభ్రం చేసిందా? వంటి అంశాలను కూడా ఈ సిస్టమ్ గుర్తిస్తుంది.

పట్టుబడ్డ వంట మనిషి..

ఈ వారం తన వంట మనిషి రెండుసార్లు దొంగతనం చేస్తూ దొరికిపోయిందని, అందుకే ఆమెను పనిలో నుంచి తొలగించానని పంకజ్ ఎక్స్‌ (X) వేదికగా వెల్లడించారు. "నేను గంటల కొద్దీ వీడియోలు చూడనని ఆమె ధీమాగా ఉండి ఉంటుంది, కానీ ఈ AI సెకన్ల వ్యవధిలో ఆమెను పట్టేసింది" అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్యాస్ లీకేజీని గుర్తించేలా, అలాగే వంట మనిషి ఎంత సమయం ఖాళీగా ఉందో ట్రాక్ చేసేలా ఈ పరికరాన్ని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.

టెక్నికల్ వివరాలు:

ఈ సిస్టమ్ కోసం పంకజ్ ప్రస్తుతం Anthropic’s Claude 4.5 అనే విజన్ మోడల్‌ను వాడుతున్నారు. అయితే, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ముఖాలను బ్లర్ చేసేలా ప్రోగ్రామ్ చేశారు. త్వరలో దీనిని పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, రాస్ప్‌బెర్రీ పై డివైజ్‌లో నడిచేలా మార్చాలనుకుంటున్నారు.

నెటిజన్ల ప్రశ్నలు - పంకజ్ సమాధానాలు:

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ప్రశ్న: ఆమెకు కొంత ఆహారం ఇవ్వొచ్చు కదా?

జవాబు: "నేను ఇది ఏర్పాటు చేయకముందే ఆమెను రెండుసార్లు హెచ్చరించాను. నా అనుమతితో తీసుకుంటే పర్వాలేదు కానీ, దొంగతనం చేస్తే ఒప్పుకోను."

ప్రశ్న: కెమెరా ఉందని తెలిసినా ఆమె దొంగతనం ఎలా చేసింది?

జవాబు: "మొదట జాగ్రత్తగానే ఉంది, కానీ ఎవరు చూస్తార్లే అనుకుని మళ్ళీ అలవాటు ప్రకారం దొంగతనం చేయడం మొదలుపెట్టింది."

Next Story