ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్‌కి బహిష్కరణ పిలుపులు
ధనతేరస్‌కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది.
By - అంజి |
ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్‌కి బహిష్కరణ పిలుపులు
ధనతేరస్‌కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది. పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ అలిష్బా ఖాలిద్‌తో బ్రాండ్ కలయికపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లండన్‌లో కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి మలబార్ గోల్డ్ ఆమెను ఆహ్వానించగా, అదే సమయంలో ఆమె గతంలో భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి. “ఆపరేషన్ సిందూర్” సమయంలో భారత సైన్యం మసీదులపై దాడి చేసిందని, “ఇది భారతదేశం చూపిన భయపడ్డ చర్య” అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. నెటిజన్లు “పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడిన వ్యక్తిని బ్రాండ్ ప్రమోషన్‌కి ఆహ్వానించడం తగదని” మలబార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. #BoycottMalabarGold హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో బహిష్కరణ పిలుపులు వెల్లువెత్తుతున్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాత్రం తమ వివరణలో, “అలిష్బా ఖాలిద్‌ను UK ఏజెన్సీ ద్వారా నియమించాం. ఆమె వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఆ సమయంలో మాకు తెలియదు. ప్రస్తుతం అన్ని సంబంధాలు తెంచుకున్నాం” అని స్పష్టం చేసింది.
గత నెలలో మలబార్ గోల్డ్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మెటా, ఎక్స్, గూగుల్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే కంటెంట్ తొలగించాలంటూ ఆదేశించింది. అయినా, ధనతేరస్ సందర్భంగా ఈ వివాదం మళ్లీ ఉధృతమైందని తెలుస్తోంది. కొందరు నెటిజన్లు “దీపావళి, ధనతేరస్ రోజున మలబార్, జోయలుక్కాస్ వంటి బ్రాండ్ల నుండి బంగారం కొనొద్దు” అంటూ పిలుపునిస్తున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, సుమారు $7.5 బిలియన్ వార్షిక ఆదాయం కలిగిన సంస్థగా చెబుతోంది.