నాలుగేళ్ల తర్వాత ఆ ట్రైన్ మళ్లీ రాబోతోంది
మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత లగ్జరీ రైలు 'డెక్కన్ ఒడిస్సీ'ని తిరిగి ప్రారంభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నాలుగేళ్ల తర్వాత ఆ ట్రైన్ మళ్లీ రాబోతోంది
మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MTDC).. దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత లగ్జరీ రైలు 'డెక్కన్ ఒడిస్సీ'ని తిరిగి ప్రారంభించింది. దక్షిణ ముంబైలోని CSMT - పన్వెల్ మధ్య డెక్కన్ ఒడిస్సీ రైలును మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గిరీష్ మహాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ (పర్యాటక శాఖ) రాధికా రస్తోగి, MTDC మేనేజింగ్ డైరెక్టర్ శ్రద్ధా జోషి సమక్షంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ జెండా ఊపి ప్రారంభించారు. డెక్కన్ ఒడిస్సీ రైలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 2004 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే ఈ రైలును కరోనా సమయంలో నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ మొదలైంది.
శ్రద్ధా జోషి మాట్లాడుతూ.. ఈ రైలు ప్రయాణం గొప్ప ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు. ఏడు రాత్రులతో ఎనిమిది రోజుల పర్యటన కోసం రైలు ముంబై నుండి ఢిల్లీకి తన ప్రయాణాన్ని సాగిస్తుందని జోషి చెప్పారు. వడోదర, జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ఆగ్రా, సవాయి మాధోపూర్‌లలో స్టాప్ లు ఉండనున్నాయి. ఈ కమర్షియల్ రన్ కోసం ఇప్పటికే 20 సీట్లు బుక్ అయినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు కోసం మహారాష్ట్ర స్ప్లెండర్' 'ఇండియన్ సోజర్న్', 'ఇండియన్ ఒడిస్సీ', 'మహారాష్ట్ర వైల్డ్ ట్రైల్', 'హెరిటేజ్ ఒడిస్సీ', 'కల్చరల్ ఒడిస్సీ' అనే ఆరు ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేసినట్లు MTDC తెలిపింది.
ఇంత లగ్జరీ ట్రైన్ లో ప్రయాణం చేయాలని అనుకుంటే ఒక్కొక్కరికి 6.5 లక్షలు ఖర్చు అవుతుంది. కపుల్స్ కు అయితే 9 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని దక్కించుకున్న ఈ ట్రైన్.. ఈసారి మరిన్ని సదుపాయాలతో వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. రైలులో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. స్పా, బార్, లగ్జరీ డీలక్స్ గదులు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
లగ్జరీ రైలులోని ప్రతి కోచ్‌లో అగ్నిమాపక యంత్రాలను అమర్చారు, ప్యాంట్రీ కార్లలో LPG గ్యాస్ స్థానంలో ఇండక్షన్ ను తీసుకుని వచ్చారు. అన్ని కోచ్‌ల ఫ్లోరింగ్‌ను మార్చేశారు. కొత్త ఎయిర్ సస్పెన్షన్ ట్రాలీలు వచ్చాయి. అన్ని కోచ్‌లలోని టాయిలెట్‌లకు బయో ట్యాంక్‌లను అమర్చారు. డెక్కన్ ఒడిస్సీలో ఇంటర్‌కామ్, వై-ఫై సౌకర్యాలు, మ్యూజిక్ సిస్టమ్, ఫర్నీచర్, బెడ్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉన్నాయి. పర్యాటకులకు "రాయల్ అనుభవాన్ని" అందించడానికి, 10 కోచ్‌లలో ఒక్కొక్కటి నాలుగు డీలక్స్ క్యాబిన్‌లతో 21 కోచ్‌లను కలిగి ఉందని MTDC తెలిపింది. రెండు కోచ్‌లలో రెండు ప్రెసిడెన్షియల్ సూట్లు ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణీకులు ఫైవ్ స్టార్ హోటల్స్ వంటి సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. అలాగే, ఈ రైలు వెళ్ళే పర్యాటక ప్రదేశాలు మహారాష్ట్రతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలను ఆనందించవచ్చు.
ఈ రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 2003లో నిర్మించగా, 2004లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జెండా ఊపి ప్రారంభించారు. MTDC ప్రకారం, ఈ రైలుకు 2004- 2020 మధ్య పర్యాటకుల నుండి భారీ స్పందన లభించింది, అయితే 2020-21లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ట్రైన్ ఆగిపోయింది. "డెక్కన్ ఒడిస్సీకి టర్న్‌కీ ప్రాతిపదికన ఒక ఆపరేటర్‌ని నియమించారు. ఆపరేటర్ మహారాష్ట్రలో 40 టూర్‌లను నిర్వహించడం తప్పనిసరి, ఆపై భారతదేశం అంతటా ఉన్న ఇతర ప్రీమియం పర్యాటక ప్రాంతాలను కవర్ చేయాల్సి ఉంటుంది" అని MTDC అధికారులు తెలిపారు. ఈ రైలు గతంలో వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్-ఆసియా లీడింగ్ లగ్జరీ ట్రైన్ అవార్డుతో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.