దేశంలో మరో కొత్త వైర‌స్‌.. త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ..!

African Swine Fever breaks out in Tripura.దేశంలో మ‌రో కొత్త ర‌కం వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. త్రిపుర‌లోని సెపాహిజాలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 11:06 AM IST
దేశంలో మరో కొత్త వైర‌స్‌.. త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ..!

దేశంలో మ‌రో కొత్త ర‌కం వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. త్రిపుర‌లోని సెపాహిజాలా జిల్లాలో ఆఫ్రిక‌న్ స్పైన్ ఫ్లూ(ఏఎస్ఎఫ్) వెలుగుచూసింది. దేవిపూర్ ప్రాంతంలో జంతు వనరుల అభివృద్ధిశాఖ (ఏఆర్‌డీడీ) నిర్వహిస్తున్న ఫారంలో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ కేసులను గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అగ్త‌ర‌ల‌లోని నిపుణుల బృందం సోమ‌వారం ఆ ఫారంను సంద‌ర్శించింది. అక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల‌ను ఏర్పాటు చేసింది.

ఈ నెల 7న‌ శాంపిల్స్‌ సేకరించి టెస్ట్‌ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీకి పంపగా 13న ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ పీసీఆర్ ఫ‌లితాల్లో పాజిటివ్‌గా వ‌చ్చింది. పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని పరిశోధక బృందం గుర్తించింది. ఫ్లూ ఫారమ్‌ మొత్తం వ్యాపించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీనిపై.. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని డిసీజ్ టెస్టింగ్ లాబొరేటరీ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ పూర్తి నిర్ధారణకు సంబంధించి మరో రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్స్‌ నుంచి రిపోర్టు వచ్చినా తర్వాత అది ఏ ఫ్లూ అనేది ఖ‌చ్చితమైన సమాచారాన్ని అందిస్తామ‌ని చెప్పారు. ఇక గుర్తు తెలియని కారణాలతో 63 పందులు చనిపోయాయని.. ఆ పందుల షెడ్డులో 265 పందులు మరియు 185 పంది పిల్లలు ఉన్నాయని వెల్లడించారు. కాగా.. ఈ ఫ్లూని అరికట్టేందుకు అక్క‌డ ఉన్న మొత్తం పందుల‌ను వ‌ధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

Next Story