కుండబద్దలు కొట్టిన సీరం అధిపతి అదర్ పూనావాలా

Adar Poonavalla comments on Vaccine Ready. సీరం అధిపతి అదర్ పూనావాలాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. వ్యాక్సిన్ తయారీపై అదర్ పూనావాలా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  3 May 2021 4:13 PM GMT
Adar Poonavalla

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం అని చెబుతూ ఉన్నారు. దీంతో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. సీరం అధిపతి అదర్ పూనావాలాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. వ్యాక్సిన్ తయారీపై అదర్ పూనావాలా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ ను పుణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆయన సంస్థ మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ఆయన స్పందించారు. రాత్రికి రాత్రే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం సాధ్యం కాదని.. వ్యాక్సిన్ తయారీ అనేది ప్రత్యేకమైన ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. టీకాల కొరత జులై నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉందని.. జులై నెలలో టీకా ఉత్పత్తి పెరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. జనవరిలో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో రెండో వేవ్ వస్తుందని అప్పట్లో అధికారులెవరూ ఊహించలేదని.. భారత్‌ కొవిడ్ సంక్షోభాన్ని గట్టెక్కుతోందనే అందరూ అనుకున్నారని తెలిపారు. అప్పట్లోనే తమకు టీకా ఉత్పత్తి కోసం ఆర్డర్లు అంది ఉంటే..సంస్థ తన టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించి ఉండేవాళ్లమని తెలిపారు.

భారత్ లో వయోజనులందరికీ తగినన్ని డోసులు ఉత్పత్తి చేయడం అంత తొందరగా సాధ్యపడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాల సహాయసహకారాలు అందుతున్నాయని.. తదుపరి కొన్ని నెలల్లో 11 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం ప్రభుత్వం నుంచి రూ.1,732.50 కోట్లు అడ్వాన్స్ గా అందిందని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు తమకు 26 కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చాయని, ఇప్పటి వరకు 15 కోట్ల డోసులను సరఫరా చేశామని అదర్ పూనావాలా తెలిపారు. మిగిలిన 11 కోట్ల డోసులను రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు రాబోయే కొన్నినెలల్లో సరఫరా చేస్తామని తెలిపారు.

భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని అదర్‌ పూనావాలా తెలిపారు. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్‌ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్‌లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని అన్నారు. మరోసారి అలాంటి ఒత్తిడిలోకి వెళ్లదలచుకోలేదని.. అందుకే లండన్‌లో మరింత కాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీకాలను అందించే బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కానీ, తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు. భారత్‌లో టీకాల కోసం కొంతమంది అంచనాలు, ఆవేశాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీని భారత్‌ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు.

Next Story
Share it