ట్రైన్‌లో కేరళ నన్స్‌కు అవమానం.. అమిత్ షా కు విజయన్ లేఖ
Accused of Conversion Two Nuns Harassed On Train In UP.హరిద్వార్ -పూరీ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు కేరళ నన్స్‌పై భజరంగ్ దళ్, ఎబివిపి విద్యార్థులు మండిపడ్డారు.
By తోట వంశీ కుమార్
బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారంటూ హరిద్వార్ -పూరీ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు కేరళ నన్స్‌పై భజరంగ్ దళ్, ఎబివిపి విద్యార్థులు మండిపడ్డారు. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుండి బలవంతంగా దింపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మార్చి 19న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే పోలీసులు కూడా నిందితులకు సహకరించారంటూ ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ నలుగురిలో ఇద్దరు క్రైస్తవ సన్యాసులు కాగా, మరో ఇద్దరు ట్రైనింగ్‌లో ఉన్నారు. వీరు తమ వద్ద ఉన్న ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపినప్పటికీ, రైల్వే పోలీసులు సైతం పట్టించుకోలేదని, వారిని బలవంతంగా కిందకు దించారనే ఆరోపణలొస్తున్నాయి. అయితే పోలీసులు తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు . రూర్కేలాలో ఏర్పాటైన శాక్ర్‌డ్ హార్ట్స్ కంగ్రెగేషన్‌కు వెళ్తున్నారని, తమతో పాటు పోస్టులాంట్స్‌ను కూడా తీసుకెళ్తున్నారని పోలీసులు మొదట వాదించారు. తర్వాత చాలాసేపు విచారించి ఆ ఆధారాలు నిజమేనని నిర్ధారించుకుని వారిని గమ్యస్థానానికి చేర్చామని ఝాన్సీకి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ సన్యాసినులపై భజరంగ్‌దళ్ కార్యకర్తల తీరు సరికాదన్నారు. అలాగే నన్స్‌ను అదుపులోకి తీసుకునేటపుడు మహిళా కానిస్టేబుల్ కూడా లేరని ఆగ్రహించారు. ఆధార్ కార్డు చూపినా వదలకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ లేఖపై స్పందించిన అమిత్‌షా...నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ విషయం పై ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పందించడంతో గతంలో కేరళ నన్స్ పై బిషప్ లైంగిక దాడి కేసుపై కూడా స్పందంచమంటూ పలువురు నేటిజన్లు కోరుతున్నారు.